Adurthi Subba Rao: ఆడుతూ పాడుతూ సినిమాలు తీయడమే ఆదుర్తి సుబ్బారావు బాణీ అంటారు… ఆదుర్తి తెరకెక్కించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను రంజింప చేశాయి… ఈ నాటికీ బుల్లితెరపై అలరిస్తూనే ఉన్నాయి… డిసెంబర్ 16న ఆదుర్తి సుబ్బారావు జయంతి… ఈ సందర్భంగా చిత్రసీమలో ఆదుర్తి పలికించిన బాణీని మననం చేసుకుందాం.
ఆదుర్తి సుబ్బారావు సినిమాల్లో అర నిమిషం కూడా అనవసరమైన సీన్ ఉండదని ప్రతీతి… ఎందుకంటే ఆయన స్వతహాగా ఎడిటర్… పక్కా ప్రణాళికతో సినిమాలను తెరకెక్కించేవారు… ఆ పంథానే జనాన్ని కట్టిపడేసేది.
ఆదుర్తి సుబ్బారావు పేరు వినగానే, ఆయన రూపొందించిన అనేక చిత్రాలు మన మదిలో మెదలుతాయి… వెంటనే అన్నపూర్ణ సంస్థ గుర్తుకు వస్తుంది… ఆ పై సదరు చిత్రాలలో హీరోగా నటించిన అక్కినేని గుర్తుకు రాకమానరు… అందువల్ల ఆ రోజుల్లో ”అ అ ఆ” అనేవారు. అంటే “అన్నపూర్ణ సంస్థ – అక్కినేని – ఆదుర్తి” అని అర్థమన్నమాట… ఈ కాంబో తెలుగువారిని భలేగా అలరించింది.
Adurthi Subba Rao: అన్నపూర్ణ సంస్థకు తొలి చిత్రం ‘దొంగరాముడు’. కేవీ రెడ్డి తీసిన ఆ సినిమా తరువాత, రెండో సినిమా ‘తోడికోడళ్ళు’కు ఆదుర్తి దర్శకుడయ్యారు… ‘తోడికోడళ్ళు’ను తమిళంలో ‘ఎంగల్ వీట్టు మహాలక్ష్మి’గా అన్నపూర్ణ సంస్థనే నిర్మించింది. ఆ సినిమా కూడా విజయం సాధించింది. దాంతో తమ ప్రతి చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఆదుర్తి దర్శకత్వంలోనే కొంతకాలం నిర్మిస్తూ సాగింది అన్నపూర్ణ సంస్థ… అన్నపూర్ణలో ఆదుర్తి తరువాతి చిత్రం ‘మాంగల్యబలం’. ఈ సినిమా మరింత విజయం సాధించింది.
అన్నపూర్ణ సంస్థ చిత్రాలతోనే దర్శకునిగా ఆదుర్తి సుబ్బారావుకు గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే! అయితే ఆయన ప్రతిభకు పట్టం కడుతూ పలువురు తమిళ, తెలుగు చిత్ర నిర్మాతలు అవకాశాలు కల్పించారు. అక్కడా తనదైన బాణీ పలికించారు ఆదుర్తి. ‘నమ్మినబంటు’లో ఎద్దులతో నటింపచేసి, దేశవిదేశాల్లోని సినీ ఫ్యాన్స్ ను మురిపించారాయన. ఆ వైనాన్ని ఎవరూ మరచిపోలేరు.
ఓ వైపు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే తమిళంలోనూ కొన్ని సినిమాలు రూపొందించారు ఆదుర్తి సుబ్బారావు. తమిళంలో ఆయన తెరకెక్కించిన ‘కుముదం’ ఆధారంగానే తెలుగులో ఏయన్నార్, సావిత్రితో ‘మంచిమనసులు’ తెరకెక్కింది… ఈ సినిమా 1962 సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలచింది.
ఇది కూడా చదవండి: Allu Arjun: అందుకే రేవతి కుటుంబాన్ని కలవలేకపోతున్నా
Adurthi Subba Rao: ఏయన్నార్ ‘మంచిమనసులు’ గుర్తుకు రాగానే వెంటనే ఆయనతో ఆదుర్తి తెరకెక్కించిన ‘మూగమనసులు’ కూడా ఇట్టే స్పురిస్తుంది… ‘మూగమనసులు’ చిత్రానికి అశోక్ కుమార్ ‘మహల్’ ప్రేరణ కాగా, ఈ సినిమా తెలుగునాట ఓ కొత్త ఒరవడి సృష్టించింది. జన్మజన్మల బంధాల కథలు అంతకు ముందు లేకపోలేదు. అయినా ‘మూగమనసులు’ ప్రేమకథ జనాన్ని ఎంతగానో మురిపించింది. 1964 సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలచింది ‘మూగమనసులు’.
హిందీ చిత్రం ‘మహల్’ స్ఫూర్తితోనే ‘మూగమనసులు’ తెరకెక్కినా, ఇందులో ఆ వాసనలే కనిపించకుండా ఆదుర్తి జాగ్రత్త పడ్డారు. అందువల్ల హిందీలోనూ ఇదే కథతో ‘మిలన్’ చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించారు ఆదుర్తి. ‘మిలన్’ తరువాత ఆదుర్తి హిందీ చిత్రాలతోనూ భలేగా సాగారు. అక్కడా ఆదుర్తి వారి బాణీ భలేగా సాగింది.ఆదుర్తి సుబ్బారావు చిత్రాలు నిర్మాతలకు ఆర్థిక పుష్టిని కలిగించడమే కాదు, ప్రేక్షకుల్లో ఆలోచనలూ రేకెత్తించేవి… అందుకే అంతగా ఆకట్టుకొనేవి… దర్శకునిగా ఆదుర్తి పేరును చూసి సినిమాలకు పరుగులు తీసేవారు జనం… అదీ ఆదుర్తి ప్రతిభావిశేషం!
Adurthi Subba Rao: ఏయన్నార్ తో పలు విజయాలు చవిచూసిన ఆదుర్తి సుబ్బారావు, మరో మహానటుడు యన్టీఆర్ తో కేవలం రెండు చిత్రాలనే రూపొందించారు… అందుకు ఏయన్నార్ కారణమని కొందరు చెబుతారు…కానీ, యన్టీఆర్ తో ఆదుర్తి సినిమాలు తీసేనాటికి, రామారావు ఇతర చిత్రాలతోనూ, ఆదుర్తి హిందీ మూవీస్ తోనూ బిజీ అయ్యారు… అదే అసలు కారణం… కానీ, కథలు భలేగా పుడతాయి కదా… యన్టీఆర్ తో ఆదుర్తి తొలి చిత్రం ‘దాగుడుమూతలు’తోనే ముళ్ళపూడి కథకుడు అయ్యారు… అంతకు ముందు యన్టీఆర్ ‘రక్తసంబంధం’కు మాటలు మాత్రమే పలికించారు ముళ్ళపూడి. రమణ కథను ‘దాగుడుమూతలు’గా జనం ముందు నిలిపి ఆదుర్తి ఎంతగానో ఆకట్టుకున్నారు…
యన్టీఆర్ తో ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన రెండవ చిత్రం ‘తోడు-నీడ’… ఇందులో తన ‘మూగమనసులు’లో గౌరిగా నటించిన జమునను ప్రధాన నాయికగా ఎంచుకున్నారు… మరో నాయికగా భానుమతి నటించారు… ‘దాగుడుమూతలు’ మంచి విజయం సాధించగా, అంతకు మించిన విజయాన్ని ‘తోడు-నీడ’ అందించింది… యన్టీఆర్ తో రెండే సినిమాలు తీసినా, జనం మదిలో నిలిచే చిత్రాలు అందించారు ఆదుర్తి.
ఆదుర్తి సుబ్బారావు పాటల చిత్రీకరణతోనే జనాన్ని ఆకట్టుకొనేవారు… ఇక పాటల్లోనూ లోతైన భావాలు పలికించే రచనలు ఎంచుకొనేవారు… ఆదుర్తి చిత్రాల్లోని పాటల్లో భావుకత ఉట్టిపడడమే కాదు, ఆశాభావమూ తోడయి అలరించేవి… పలు సందర్భాల్లో పలువురు గీతరచయితలతో సాగిన ఆదుర్తి తన మనసులోని మాటలనే వారి పాటల్లో పలికించమని కోరేవారు… అందుకే పాటల చిత్రీకరణలోనూ ఆదుర్తి తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీ పలికించారు.
ఇది కూడా చదవండి: Bigg Boss: ‘నిఖిల్’ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్.. ఎన్ని లక్షలు గెలుచుకున్నాడో తెలుసా..?
Adurthi Subba Rao: ఎన్ని చెప్పినా, తనను ఆదరించిన అన్నపూర్ణ సంస్థకు ఎప్పుడూ దన్నుగానే ఉన్నారు ఆదుర్తి… ఏయన్నార్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం సైతం ఆదుర్తి నిర్దేశకత్వంలోనే వెలుగు చూసింది… ఈ చిత్రం అభిమానులకు అమితానందం పంచింది… ఏయన్నార్ డ్యుయల్ రోల్ మూవీస్ లో ఇప్పటికీ ఫ్యాన్స్ కు ఫేవరెట్ మూవీ ‘ఇద్దరు మిత్రులు’… అందులోని పాటలు, మాటలు నేటికీ గుర్తు చేసుకొని పులకించిపోతుంటారు అభిమానులు…
అంతకు ముందు బెంగాలీ నవలల ఆధారంగానే పలు తెలుగు చిత్రాలు తెరకెక్కాయి… అన్నపూర్ణ సంస్థ కూడా అదే బాటలో సాగింది… ఆ సమయంలో డాక్టర్ శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల ఆధారంగా అన్నపూర్ణ సంస్థ ఆదుర్తి దర్శకత్వంలో ‘చదువుకున్న అమ్మాయిలు’ నిర్మించింది… ఈ సినిమా మునుపటి అన్నపూర్ణవారి సినిమాల స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, ఆదుర్తి బాణీ అలరిస్తుంది.
‘చదువుకున్న అమ్మాయిలు’ తరువాత అన్నపూర్ణ సంస్థ కోడూరి కౌసల్యాదేవి నవల ‘చక్రభ్రమణం’ ఆధారంగా ‘డాక్టర్ చక్రవర్తి’ నిర్మించింది… ఇందులోనూ అక్కినేని, ఆదుర్తి కాంబోనే సాగింది… ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు, తొలి బంగారు నంది అందుకున్న చిత్రంగా నిలచింది… అలా నంది అవార్డుల ఆరంభంలోనే ఆదుర్తివారి సినిమా తన సత్తా చాటుకోవడం విశేషం!
ఇది కూడా చదవండి: Manchu manoj: మా జనరేటర్ లో చెక్కర పోశాడు.. విష్ణు పై మనోజ్ సీరియస్..
Adurthi Subba Rao: దర్శకత్వంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఆదుర్తి, ప్రయోగాలతోనూ మురిపించారు… తరువాతి రోజుల్లో అవి అనేకమంది దర్శకులకు స్ఫూర్తి నిచ్చాయి… ఆదుర్తి బాటలో పయనించి పలువురు డైరెక్టర్స్ సక్సెస్ రూటులో సాగడం విశేషం.
మనకు గుర్తున్న దర్శకుల్లో కొత్తవారికి పలు అవకాశాలు కల్పించిన వారిలో దాసరి నారాయణరావు ముందుంటారు… ఈ విషయంలో ఆయనకు స్ఫూర్తి కలిగించినది ఆదుర్తి సుబ్బారావే!… తాను తెరకెక్కించిన ‘తేనెమనసులు’ ద్వారా కొత్తవారిని తెరకు పరిచయం చేశారు ఆదుర్తి … కృష్ణ, రామ్మోహన్ ఈ సినిమాతో పరిచయమైన వారే…
‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి తొలి బంగారు నంది అవార్డు లభించడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని భావించారు అక్కినేని, ఆదుర్తి… దాంతో ‘డాక్టర్ చక్రవర్తి’ ద్వారా లభించిన తమ ఇద్దరి పారితోషికాలు కలిపి, ‘చక్రవర్తి చిత్ర’ అనే బ్యానర్ నెలకొల్పారు… ఆ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘సుడిగుండాలు’ నిర్మించారు… ఈ చిత్రానికి ఆదుర్తి దర్శకులు, ఏయన్నార్ కీలక పాత్రలో కనిపించారు.
‘సుడిగుండాలు’ మంచి చిత్రంగా మిగిలిందే కానీ, అక్కినేని, ఆదుర్తికి నష్టాలు మిగిల్చింది… తరువాత మరో ప్రయత్నంగా ‘మరో ప్రపంచం’ నిర్మించారు… ఇది కూడా పరాజయం పాలయింది… ఆ పై ఆదుర్తి హిందీలో వరుసగా చిత్రాలు రూపొందించారు… వీటన్నిటికంటే ముందు ఆదుర్తికి ఓ స్థానం కల్పించిన అన్నపూర్ణ సంస్థకు, అక్కినేనికి పరాజయం ఎదురయింది… ఆ సమయంలో ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన ‘పూలరంగడు’ ఘనవిజయం సాధించి, మళ్ళీ అన్నపూర్ణ కళకళలాడింది…
Adurthi Subba Rao: ‘పూలరంగడు’ తరువాత మళ్ళీ అన్నపూర్ణ సంస్థలో ఆదుర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘విచిత్రబంధం’…. యద్దనపూడి సులోచనారాణి నవల ‘విజేత’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది… ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది… ఇదే ఆదుర్తి చివరి ఘనవిజయం అని చెప్పవచ్చు… అలా తనకు తొలి విజయాన్ని అందించిన సంస్థలోనే చివరి సిల్వర్ జూబ్లీ చూశారు ఆదుర్తి…
తాను పరిచయం చేసిన కృష్ణ, హీరోగా సెట్ కావడం ఆదుర్తికి ఎంతో ఆనందం కలిగించింది… కృష్ణ హీరోగా ఆదుర్తి దర్శకత్వంలో ‘మాయదారి మల్లిగాడు’ తెరకెక్కింది… ఆ రోజుల్లో ఈ సినిమా మంచి ఆదరణ పొందింది… కృష్ణ హిట్ మూవీస్ లో ఒకటిగా ‘మాయదారి మల్లిగాడు’ నిలచింది… ఈ నాటికీ కృష్ణ ఫ్యాన్స్ కు ఇష్టమైన చిత్రాలలో ఒకటిగా ‘మాయదారి మల్లిగాడు’ నిలచే ఉంది…
అన్నపూర్ణ సంస్థలో ‘బంగారుకలలు’తో మరో నవలాచిత్రం అందించారు ఆదుర్తి… అక్కినేని హీరోగా రూపొందిన ఈ చిత్రం కూడా యద్దనపూడి నవల ఆధారంగా రూపొందినదే… అయితే ‘విచిత్రబంధం’ స్థాయిలో ఇది అలరించలేకపోయింది… ఈ సినిమా తరువాత ఆదుర్తి తెరకెక్కించిన “గాజుల కిష్టయ్య, గుణవంతుడు” అంతగా ఆకట్టుకోలేకపోయాయి… అక్కినేనితో ‘మహాకవి క్షేత్రయ్య’ రూపొందిస్తూండగా ఆదుర్తి కన్నుమూశారు… సి.ఎస్.రావు ఆ సినిమాను పూర్తి చేశారు… ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో చెరిగిపోని ముద్ర వేశారు ఆదుర్తి… ఆయన చిత్రాలు తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించాయి…
అన్నపూర్ణ సంస్థ చూసిన స్వర్ణయుగంలో అధిక శాతం చిత్రాలు ఆదుర్తి రూపొందించినవే… ఆ సినిమాలు ఇప్పటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉన్నాయి… వీలయితే చూడండి… ఆదుర్తి బాణీని గమనించండి… ఆయన శైలికి ఆకర్షితులు కాకుండా ఉండలేరు… ఇది సత్యం..