Hyderabad: హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ పారిశ్రామిక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో ‘SKR ఫుడ్ ప్రొడక్ట్స్’ అనే సంస్థపై అధికారులు మెరుపు దాడి నిర్వహించి, పెద్ద ఎత్తున కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో అబిడ్స్ ప్రాంతానికి చెందిన హసన్ అలీ రూపానీ (55) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు కేంద్రంలో తయారీ విధానం చూసి అధికారులు విస్తుపోయారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ఈగలు ముసురుతున్న చోట ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా, కేవలం లాభాల కోసమే నిందితుడు ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తేలింది.
ముఖ్యంగా ఈ పేస్ట్ తయారీలో నాణ్యత లేని కుళ్ళిపోయిన అల్లం, వెల్లుల్లి తొక్కలను వాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటికి రంగు, రుచి రావడం కోసం ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారు. ఇలా తయారైన కల్తీ పేస్ట్‌ను నగరంలోని ప్రధాన కిరాణా షాపులకు, ఫంక్షన్లకు భోజనాలు వండే క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిసింది.
ఈ దాడిలో సుమారు రూ. 22 లక్షల విలువైన వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో 4,000 కిలోలకు పైగా సిద్ధంగా ఉన్న అల్లం-వెల్లుల్లి పేస్ట్, 6,000 కిలోల నాసిరకం వెల్లుల్లి, భారీగా రసాయనాలు, ఉప్పు మరియు ఐదు గ్రైండింగ్ యంత్రాలు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న సామాగ్రితో పాటు నిందితుడిని తదుపరి చర్యల కోసం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ప్రజలు బయట దొరికే వస్తువులను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
