ఆడుదాం ఆంధ్రా!!! వైసీపీ ప్రభుత్వంలో క్రీడా సంబరంగా చెప్పుకున్న ఈ కార్యక్రమం, ఇప్పుడు అవినీతి అడ్డాగా వెలుగు చూస్తోంది. కడప జిల్లాకు చెందిన ఓ ఇంజనీరింగ్ అధికారి, తన వివాహేతర సంబంధంతో వచ్చిన తలనొప్పుల కారణంగా.. అనివార్యంగా ఈ స్కాండల్‌ను బయటపెట్టేశాడు. రోడ్లు, భవనాల శాఖలో పనిచేస్తున్న సదరు అధికారి, వైసీపీ అధికారంలోకి రాగానే రాజధానిలో కీలక పోస్టు సంపాదించాడు.
మళ్లీ ఈయనే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని, దాని వెనుకున్న అసలు టార్గెట్‌ని నిర్విఘ్నంగా నెరవేర్చేందుకు శాప్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లాడు. నాడు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆర్కే రోజా చేతిలో, శాప్ చైర్మన్ గిరి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరే ఏరి కోరి సదరు అధికారిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
‘ఆడుదాం ఆంధ్రా’ టెండర్లు, కొనుగోళ్ల పర్యవేక్షణలో సదరు అధికారిధే కీలక పాత్రట. టెండర్లలో భారీ అవినీతి జరిగినా, ఆధారాలు బయటకు రాకుండా చాకచక్యంతో వ్యవహరించి… రోజా, బైరెడ్డిలు తనపై పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేశాడని ఆరోపణలు. రోజా, బైరెడ్డి సూచనల మేరకు వాటాల పంపిణీని కూడా ఈ అధికారే నిర్వహించినట్లు సమాచారం. అయితే, అతని వ్యక్తిగత జీవితంలో ఓ ట్విస్ట్ ఈ అవినీతిని బట్టబయలు చేసింది.
నందిగామకు చెందిన ఓ మహిళతో అతని వివాహేతర సంబంధం ఉన్న సంగతి అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంబంధంలో భాగంగా, అతను ఆ మహిళకు అనంతపురంలో కియా పరిశ్రమ సమీపంలోని తన కుటుంబ భూమిని రిజిస్టర్ చేయించాడట. అంతేకాక, రూ.12 కోట్ల నగదును ఆమె ఖాతాకు బదిలీ కూడా చేశాడట.
ఇది కూడా చదవండి: Tahawwur Rana: నాకు గుర్తులేదు.. నాకు తెలియదు.. 3 గంటల విచారణలో తహవుర్ రానా ఏం చెప్పారు అంటే..?
మరి ఈ విషయం తెలిసిన ఆ అధికారి భార్య ఊరుకుంటుందా? నేరుగా నందిగామ వెళ్లి.. తన భర్తతో సంబంధం పెట్టుకున్న సదరు మహిళని కొంగు పట్టుకుని మరీ నిలదీసిందట. తన భర్త రాసిచ్చిన భూమిని తిరిగి ఇచ్చేయాలనీ, డబ్బుల్ని తమ ఖాతాలోకి ట్రాన్ఫర్ చేయాలని కొంచెం గట్టిగానే అడిగిందట అధికారి భార్య. అందుకు ససేమిరా అన్న సదరు రెండో మహిళ.. తనపై దాడి చేశారని అధికారి భార్యాపిల్లపై నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, అధికారిని విచారణకు పిలిచారు. విచారణలో అతను ‘ఆడుదాం ఆంధ్రా’ టెండర్ల నుంచి వచ్చిన సొమ్మును ఆ మహిళకు బదిలీ చేసినట్లు ఒప్పుకున్నాడని సమాచారం. ఆ 12 కోట్ల రూపాయాల్ని వివిధ ఖాతాల ద్వారా తన ప్రియురాలికి బదిలీ చేసినట్లు కూడా ఒప్పేసుకున్నాడట. ఇంకేముంది.. మొన్నటిదాకా ఆడుదాం ఆంధ్రాలో అసలు అవినీతి ఏది? దమ్ముంటే అరెస్టు చేయండి.. అంటూ రెచ్చిపోయిన రోజాకు… అధికారి వివాహేతర సంబంధం కారణంగా ఊహించని షాకిచ్చింది.
ఈ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి పెట్టిన 119 కోట్ల ఖర్చులో దాదాపు 70 కోట్లు దుర్వినియోగమైనట్లు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అధికారి చేసిన ఘనకార్యంతో ఇప్పుడు రోజా, బైరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఐడీ పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. రోజా గతంలో ఈ కార్యక్రమంలో అవినీతి లేదని, అన్ని బిల్లులూ సక్రమంగా ఉన్నాయని వాదించినా, ఈ కొత్త ఆధారాలు ఆమెను ఇరుకున పడేశాయి. ఈ అధికారి గుట్టు, ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతిని అనూహ్యంగా రట్టు చేసేసింది. అలా కూటమి ప్రభుత్వానికి వెతకబోయే తీగ కాలికి తగిలినట్లైంది.