Adilabad Bandh: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన GO.NO.49ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.
అదిలాబాద్ జిల్లాలో బంద్ పిలుపు
ఈ నిర్ణయానికి నిరసనగా సోమవారం (నేడు) ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రజలు, వ్యాపారవేత్తలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు బంద్‌లో పూర్తిగా సహకరించాలని తుడుం దెబ్బ నాయకులు విజ్ఞప్తి చేశారు.
తుడుం దెబ్బ నాయకుల వ్యాఖ్యలు
తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ –
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5వ షెడ్యూల్ చట్టాలు, పేసా చట్టం, 1/70 చట్టంలను ఉల్లంఘించాయని,
-
గ్రామసభల అనుమతి లేకుండా GO.NO.49ను అమలు చేశారని,
-
ఇది ఆదివాసీల అస్తిత్వం, మనుగడ, హక్కులకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు.
ఈ GOను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.
అందరి సహకారం కోరిన తుడుం దెబ్బ
బంద్ విజయవంతం కావడానికి ప్రజలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళా సంఘాలు, వామపక్ష పార్టీలు, మేధావులు అందరూ పాల్గొనాలని తుడుం దెబ్బ విజ్ఞప్తి చేసింది.
నాయకుల పాల్గొనడం
ఈ బంద్ పిలుపులో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిర, డివిజన్ ఉపాధ్యక్షులు ఆత్రం గణపతి, సోయం లలిత బాయి, మావల మండల అధ్యక్షుడు వేడమ ముకుంద్, ఉపాధ్యక్షులు తోడసం ప్రకాష్, కుమ్ర గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.