Farmers Protest

Farmers Protest: సోయా రైతుల పోరు.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. పంట కొనాలని ఆదిలాబాద్ రైతుల ఆవేదన

Farmers Protest: తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని, పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోయా రైతులు శనివారం అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సోయాబీన్ పంట తడిసి రంగు మారిందని, దీంతో అధికారులు కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కాసేపు తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మేమంతా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్లం కాదని, కేవలం కష్టాల్లో ఉన్న రైతులం మాత్రమేనని వారు స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చామని చెప్పారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా కేవలం ఐదుగురు రైతు ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. తమతో వచ్చిన రైతులందరినీ లోపలికి పంపిస్తేనే వెళ్తామని పట్టుబట్టిన రైతులు, చివరకు పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

జిల్లాలో సుమారు 24 వేల మంది రైతులు 72 వేల ఎకరాల్లో సోయా సాగు చేయగా, దిగుబడి భారీగా వచ్చింది. ఇప్పటివరకు సుమారు 6 వేల మంది రైతుల నుంచి 1.64 లక్షల క్వింటాళ్ల సోయాను ప్రభుత్వం సేకరించింది. కానీ, ఇంకా 2.80 లక్షల క్వింటాళ్లకు పైగా పంట రైతుల వద్దే నిల్వ ఉందని వారు వాపోతున్నారు. వర్షాల వల్ల పంట నాణ్యత తగ్గిందన్న నెపంతో కొనుగోలు ఆపకూడదని, వెంటనే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మిగిలిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *