Adi srinivas: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత స్వయంగా ఒప్పుకోవడం విశేషమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు ఇంతకాలం చెబుతున్న ఆరోపణలే కవిత మాటలతో నిజమయ్యాయని అన్నారు.
ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘హరీష్ రావు అక్రమాలను బయటపెట్టింది సీఎం రేవంత్ రెడ్డే. ఆయన ఎవరిపైన ఆధారపడరు. నిజానికి అందరూ రేవంత్ వెనకే ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతి వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టులు అవినీతికి వేదిక కావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే సత్యం బయటకు రావాల్సిందేనని అన్నారు. ఇకపై ఈ అంశాన్ని రాజకీయ పార్టీలన్నీ సీరియస్‌గా తీసుకుని, అవినీతి చేసిన వారిని ఎలాంటి హోదాలో ఉన్నా శిక్షించాలంటూ ఆదిశ్రీనివాస్ స్పష్టం చేశారు.