ADB-Fake Certificates Scam: ఆ యువకులు కేంద్ర భద్రతా సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. దేశ సరిహద్దులో కీలక విధులు నిర్వర్తించే ఐటీబీపీ దళంలో కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు!! కానీ, వారి ధ్రువపత్రాల పరిశీలనలో అసలు విషయం బయటపడింది. నకిలీ నివాస ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందేందుకు యత్నించినట్లు అధికారుల విచారణలో తేలింది.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ‘నకిలీ’ దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇచ్చోడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహాని సూరజ్, గజేంద్ర, దిగ్విజయ్ విసుకర్మ ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరు ముగ్గురూ ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్, కోక్‌సమన్నూర్ గ్రామ నివాసులమంటూ నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే ధ్రువపత్రాల పరిశీలనలో అసలు విషయం బయటపడింది.
ఈ ముగ్గురూ తమ గ్రామస్థులే కాదని స్థానిక ప్రజలు తేల్చిచెప్పారు. అలాంటి పేర్లతో ఎవరూ లేరని చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. మరింత లోతుగా విచారణ చేపట్టగా.. వీరు తెలంగాణకు చెందిన వారే కాదని తేలింది. దీంతో ఆ ముగ్గురిపై ఇచ్చోడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక ఇస్లాంనగర్‌లో 14 మంది నకిలీ ధ్రువపత్రాలను కలిగి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అలాగే ఇంద్రవెల్లి, సిరికొండ, బేల మండలాల్లో కూడా నకిలీ సర్టిపికెట్లు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read: Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ADB-Fake Certificates Scam: గతంలోనూ ఇచ్చోడ మండలంలో నకిలీ కల్యాణలక్ష్మి దరఖాస్తులు వెలుగుచూశాయి. ఇచ్చోడలోని మీసేవ ద్వారానే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. నకిలీ నివాస ధ్రువపత్రాల బాగోతం బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల వారు ఐటీబీపీకి ఇక్కడి నుంచి ఎందుకు దరఖాస్తు చేశారు? దీని వెనక ఎవరున్నారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దందా వెనక ఏదైనా కుట్ర ఉందా!? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితులకు సహకరిస్తున్నదెవరో కూడా గుర్తించే పనిలో పడ్డారు. రెవెన్యూ అధికారులతో పాటు మీసేవ కేంద్రాల నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. ఇక తన సంతకంతో కూడిన ఫేక్ నివాస ధ్రుపత్రాలను సృష్టించిన సూరజ్, అబ్దుల్ ఖాన్, హతుల్ కుమార్ యాదవ్, బిపిన్ యాదవ్‌పై గతంలో ఇచ్చోడలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేసిన జాదవ్ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టులోనే ఆయన బదిలీపై వెళ్లిపోగా.. సెప్టెంబరు, అక్టోబరుల్లో నకిలీ నివాస ధ్రువపత్రాలను సృష్టించినట్లు అధికారుల విచారణలో తేలింది.


