Adavi sesh: హీరోల పేర్లకు ముందు ప్రత్యేక ట్యాగ్‌లు, బిరుదులు పెట్టుకోవడం సినీ ఇండస్ట్రీలో సాధారణమైపోయింది. కానీ యువ కథానాయకుడు అడివి శేష్ మాత్రం ఈ ట్రెండ్‌కు పూర్తిగా భిన్నంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన పేరుకు ముందు ఎలాంటి ట్యాగ్‌లు పెట్టుకోవాలనే ఆసక్తి తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
“చిన్నప్పుడే మా అమ్మానాన్న నాకు ‘అడివి శేష్’ అనే గుర్తింపును ఇచ్చారు. అదే నాకు చాలనిపిస్తుంది. కొత్తగా బిరుదులు జోడించుకోవడం, వాటికి సంబంధించిన పీఆర్ కార్యక్రమాలు చేయడం నాకు ఇష్టం లేదు. తరతరాలు గుర్తుండిపోయే మంచి సినిమాలు చేయడమే నా లక్ష్యం” అని శేష్ తెలిపారు.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.
సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ ఎందుకు వస్తుందనే ప్రశ్నకు స్పందించిన శేష్, “ఒక చిన్న టీజర్‌కే ఎంతో సమయం, కష్టపడ్డాం. ప్రేక్షకులకు నాణ్యమైన సినిమా అందించడమే నా ప్రాధాన్యం. ఆలస్యమైనా సరే మంచి సినిమానే చేయాలనుకుంటున్నాను” అని వివరించారు.
‘డెకాయిట్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గూఢచారి–2’ కూడా వచ్చే ఏడాది మరో పండుగకు విడుదల కానుందని ఆయన ప్రకటించారు.
పెద్ద హీరోల సినిమాల మధ్య తమ సినిమా విడుదల చేయడంపై నిర్మాత సుప్రియ స్పందిస్తూ, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఇదే విధంగా గతంలో అగ్ర హీరోల చిత్రాల మధ్య విడుదలైన ‘మేజర్’ ఘన విజయం సాధించిందని అడివి శేష్ గుర్తుచేశారు.
