Teena Sravya: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసి వివాదంలో చిక్కుకున్న నటి టీనా శ్రావ్య ఎట్టకేలకు స్పందించారు. తన చర్య వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసుకున్న ఆమె, బుధవారం ఒక ఆడియో సందేశం ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. వనదేవతలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె వివరణ ఇచ్చారు.
అసలు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ఆమె స్పష్టం చేశారు. తన పెంపుడు కుక్కకు ఇటీవల ఒక పెద్ద సర్జరీ (ట్యూమర్ ఆపరేషన్) జరిగిందని, అది ప్రాణాపాయం నుంచి కోలుకోవాలని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ భక్తితోనే మొక్కు తీర్చుకున్నామని, అయితే ఇది ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని తాను ఊహించలేదని చెప్పారు. తెలియక చేసిన పొరపాటును క్షమించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతానని ఆమె హామీ ఇచ్చారు.
మరోవైపు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర ఈ నెల 28 నుండి 31 వరకు జరగనుంది. జాతర రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుందనే ఉద్దేశంతో, టీనా శ్రావ్య వంటి పలువురు భక్తులు ముందస్తుగానే వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సారి జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రత మరియు వసతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
