Tirumala: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్న ఈ ముద్దుగుమ్మలు, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
దర్శనం అనంతరం మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. “స్వామి వారిని దర్శించుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఈ నెల 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మాతో పాటు ఈ పండుగకు విడుదలవుతున్న మిగిలిన సినిమాలు కూడా విజయవంతం కావాలని కోరుకున్నాను” అని తెలిపారు. అంతేకాకుండా అక్కినేని నాగచైతన్యతో కలిసి నటిస్తున్న సినిమా కూడా ఈ ఏడాదే వస్తుందని, మరిన్ని కొత్త సినిమాల వివరాలు త్వరలో చెబుతానని ఆమె అన్నారు.
మరో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కూడా స్వామి వారిని దర్శించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నానని, సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలన్నీ సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు. త్వరలోనే తన కొత్త ప్రాజెక్టుల గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. సంక్రాంతి సినిమాల సందడి మొదలవుతున్న తరుణంలో హీరోయిన్లు ఇలా తిరుమలలో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
