Lakshmi Menon: ప్రముఖ నటి లక్ష్మీ మీనన్‌పై కొచ్చిలో కిడ్నాప్, దాడి కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఆమె మాత్రం పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆమెకు కేరళ కోర్టులో ఊరట లభించింది. సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటన సినీ వర్గాలలో కలకలం సృష్టించింది.
కొచ్చిలోని ఒక బార్‌లో నటి లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు , ఒక ఐటీ ఉద్యోగి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ అక్కడితో ముగియక, ఐటీ ఉద్యోగి కారులో వెళ్తుండగా లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు అతడిని వెంబడించారు. నార్త్ రైల్వే బ్రిడ్జి వద్ద అతని కారును అడ్డగించి, బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని దాడి చేశారు. అనంతరం, అతడిని ఒక జంక్షన్ వద్ద వదిలేసి వెళ్ళిపోయారు.
Also Read: Mirai: టాప్ బ్యానర్లతో మిరాయ్ సంచలనం!
బాధితుడు వెంటనే ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కూడా పోలీసులకు లభించాయి. ఈ ఆధారాల ఆధారంగా పోలీసులు లక్ష్మీ మీనన్ స్నేహితులైన మిథున్, అనీష్, సోనమోల్‌ను అరెస్ట్ చేశారు.
ఈ కేసు నమోదైన తర్వాత లక్ష్మీ మీనన్ కనిపించకుండా పోవడంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. అయితే, ఆమె పోలీసుల అదుపులోకి వెళ్లకుండా నేరుగా కేరళ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేసు విచారణ అనంతరం కోర్టు సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనితో లక్ష్మీ మీనన్‌కు తాత్కాలికంగా ఊరట లభించింది. లక్ష్మీ మీనన్ తెలుగులో “గజరాజు”, “ఇంద్రుడు”, “చంద్రముఖి 2” వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 17న జరగనుంది.