Kalpika: టాలీవుడ్ నటి కల్పిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి హైదరాబాద్‌లోని మొయినాబాద్ – కనకమామిడిలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె ప్రవర్తన తీవ్ర చర్చకు దారితీసింది. రిసార్ట్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, హంగామా సృష్టించిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై కల్పిక తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.
రిసార్ట్‌లో కల్పిక హంగామా.. సిబ్బంది ఆరోపణలు!
సోమవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో కల్పిక ఒక క్యాబ్‌లో ఒంటరిగా బ్రౌన్ టౌన్ రిసార్ట్‌కు వచ్చింది. రిసెప్షన్‌లో అడుగు పెడుతూనే, మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఆమె తీరు చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖంపై విసరడం వంటివి చేసిందని, అంతేకాకుండా అసభ్యంగా బూతులు కూడా మాట్లాడిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. సిగరెట్లు కావాలంటూ పనిచేస్తున్న ఇతర సిబ్బందిపైనా దుర్భాషలాడినట్లు తెలిసింది. సుమారు 40 నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో కల్పిక నాటకాలు, వేధింపులతో ఇబ్బందులు సృష్టించిందని సిబ్బంది అంటున్నారు. దీనివల్ల రిసార్ట్‌లో ఉన్న ఇతర అతిథులు కూడా ఇబ్బంది పడ్డారని వారు చెబుతున్నారు. కల్పిక ప్రవర్తన చూస్తుంటే ఆమె ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉందా అనే అనుమానాలు కూడా సిబ్బందిలో కలిగాయని తెలుస్తోంది.
Also Read: Coolie vs War 2: కూలీపై వార్ 2 ఆధిపత్యం!
కల్పిక వివరణ: “అది సిబ్బంది తప్పు!”
తనపై వచ్చిన ఆరోపణలపై కల్పిక తాజాగా స్పందించింది. రిసార్ట్‌లోని సిబ్బంది అనవసరంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొంది. తాను ఎలాంటి హంగామా చేయలేదని, నిజానికి వారే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పింది. “క్యాబ్ సదుపాయం లేదు, వైఫై పనిచేయడం లేదు, సిగరెట్ తీసుకురమ్మన్నా తీసుకురాలేదు. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది స్పందించలేదు. నా అవసరాలపై కనీస గౌరవం చూపకపోవడంతోనే బాధతో కొందరిని బూతులు తిట్టాల్సి వచ్చింది. అది తప్పుడు అర్థం చేసుకోవడం వలనే ఈ వివాదం పెద్దదైంది,” అని కల్పిక వివరించింది.
అంతేకాకుండా, తనను పోలీసులు ఒక వేరే కేసు విషయంలో వేధిస్తున్నారని, ఆ బాధ నుంచి ఓదార్పు కోసమే రిసార్ట్‌కి వెళ్లానని కల్పిక తెలిపింది. అక్కడైనా మనశాంతిగా ఉండాలని అనుకున్నానని, కానీ అక్కడ కూడా సమస్యలు మొదలయ్యాయని ఆమె వాపోయింది. “అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అక్కడికి వెళ్లలేదు,” అని కల్పిక స్పష్టం చేసింది.

