Kalpika Ganesh : ప్రముఖ టాలీవుడ్ నటి కల్పిక గణేష్, ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘యశోద’, ‘హిట్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన కల్పిక, కొన్ని వ్యక్తిగత వ్యవహారాల్లో పదే పదే వివాదాస్పదమవుతున్నారు. ఈ క్రమంలో, ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఒక సంచలనాత్మక ఫిర్యాదు చేశారు.
కల్పికకు ‘మెంటల్ డిజార్డర్’ (మానసిక రుగ్మత) ఉందని, ఆమె ‘బోర్డర్‌లైన్ నార్సిసిస్టిక్ డిజార్డర్’తో బాధపడుతోందని సంఘవార్ గణేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కారణంగా తన కుమార్తె వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకుందని, 2023లో ఆశ ఆసుపత్రిలో చికిత్స పొందిందని, రిహాబిలిటేషన్ సెంటర్‌కు కూడా పంపించామని తెలిపారు.
Also Read: CM Chandrababu: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప పర్యటన
అయితే, గత రెండేళ్లుగా కల్పిక మందులు వాడటం మానేసిందని, దాంతో డిప్రెషన్‌కు గురై తరచుగా గొడవలు చేస్తోందని, ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోందని తండ్రి ఫిర్యాదులో వివరించారు. తన కుమార్తెను తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను లిఖితపూర్వకంగా కోరారు. తండ్రి ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు నటి కల్పికపై సెక్షన్ 23 మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.