Actor Robo Shankar

Actor Robo Shankar : అనారోగ్యంతో నటుడు రోబో శంకర్ మృతి..

Actor Robo Shankar: తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు, విలక్షణ నటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయం, కిడ్నీ సమస్యలతో పాటు ఇటీవల పచ్చకామెర్లతో బాధపడుతున్న ఆయన, ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో కోలీవుడ్‌లో దిగ్భ్రాంతి నెలకొంది.

గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోబో శంకర్ గురువారం సాయంత్రం స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. ఇంద్రజ కూడా ‘బిగిల్’ సినిమాతో నటిగా పరిచయమయ్యారు.

స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన శంకర్, టీవీ షో ‘కలక్క పావతు యారు’ ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందారు. రోబోలా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆయనకు “రోబో శంకర్” అనే పేరు స్థిరపడింది. ఆ తరువాత సినిమాల్లో ప్రవేశించి, ‘మారి’, ‘విశ్వాసం’, ‘వేలైక్కారన్’, ‘హే’, ‘దీపావళి’ వంటి అనేక చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆయన నటించిన చివరి చిత్రం ‘సొట్టా సొట్టా ననైయుతూ’.

ఇది కూడా చదవండి: Hyderabad Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షాలు.. వరుణుడి ప్రతాపం మళ్లీ మొదలు!

ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని వలసరవక్కంలోని ఇంటికి తరలించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

కమల్ హాసన్ భావోద్వేగ నివాళి

రోబో శంకర్ మృతిపై అగ్ర నటుడు కమల్ హాసన్ గాఢసంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ, “రోబో అనేది నీకు మారుపేరు మాత్రమే.. కానీ నువ్వు మనసున్న గొప్ప మనిషివి. నా చిన్న తమ్ముడిలాంటి వాడివి. నీ పని పూర్తయి వెళ్లిపోయావు. కానీ నా పని ఇంకా మిగిలే ఉంది. రేపు నువ్వు మమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతావు, కానీ ఆ రేపు మాది కూడా అవుతుంది” అంటూ భావోద్వేగపూరిత సందేశం రాశారు.

రోబో శంకర్ అకస్మాత్తు మరణం తమిళ సినిమా పరిశ్రమకు తీరని లోటు. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *