Prakash Raj

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ల కేసులో ప్రకాష్‌రాజ్‌ ఈడీ విచారణ పూర్తి

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దుబాయ్‌కు చెందిన బెట్టింగ్ యాప్‌ల ప్రచారం, వాటి ద్వారా జరిగిన లావాదేవీలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రకాష్‌రాజ్‌ను దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. ఈడీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రకాష్‌రాజ్‌ దుబాయ్‌ నుంచి నడుస్తున్న కొన్ని బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన సొమ్మును కొందరు సినీ ప్రముఖులు దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్‌రాజ్‌ గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా “జంగిల్ రమ్మీ” అనే బెట్టింగ్ యాప్ ద్వారా ప్రకాష్‌రాజ్‌ భారీగా లాభపడినట్లు ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం.

Also Read: CPI narayana: మోడీ, కేసీఆర్ అబద్ధాల వీరులు

విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని అన్నారు. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి తనకు ఎలాంటి డబ్బులు అందలేదని స్పష్టం చేశారు. గతంలో “జంగిల్ రమ్మీ” యాప్‌తో తన ఒప్పందం పూర్తయ్యాక దానిని రెన్యూవల్ చేయలేదని, ఇకపై ఏ బెట్టింగ్ యాప్‌లకూ ప్రచారం చేయనని ఆయన అన్నారు.

బెట్టింగ్ యాప్‌ల ద్వారా డబ్బు సంపాదించాలని ఎవరూ భావించవద్దని ప్రకాష్‌రాజ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దయచేసి బెట్టింగ్ యాప్‌లు ఆడవద్దని, స్వయంగా కష్టపడి సంపాదించే మార్గాలను చూసుకోవాలని ఆయన సూచించారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని, మళ్లీ విచారణకు రావాలని తనను పిలవలేదని ప్రకాష్‌రాజ్‌ వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *