ACB: ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై విచారణను ముమ్మరం చేసిన అవినీతి నిరోధక శాఖ (ACB) తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఆయన వాడిన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్, ట్యాబ్‌లు రేపటిలోగా ఏసీబీకి అప్పగించాల్సిందిగా సూచించింది.
ఏసీబీ సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన డేటా ఉండే అవకాశం ఉంది. కేటీఆర్ ఈ పరికరాల ద్వారానే అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని సంబంధిత డాక్యుమెంట్లను సిద్దం చేస్తున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
ఇంతకుముందు ఏసీబీ ఎదుట ఎనిమిది గంటల పాటు కేటీఆర్ విచారణకు హాజరై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన న్యాయసలహా ప్రకారం తదుపరి చర్యలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు పై దర్యాప్తు మరింత వేగవంతమవుతున్న వేళ, ఎలక్ట్రానిక్ పరికరాల సమాచారం ఏ మేరకు కీలకంగా మారుతుందో వేచి చూడాల్సి ఉంది.