Abhishek Bachchan: కొందరు కథానాయకులు సినిమాల కోసం పడే తపన అంతా ఇంతా కాదు. పాత్రకు తగ్గట్టుగా మారడం కోసం వాళ్ళు నెలల తరబడి, తమ శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. అయితే ఎంతో కష్టపడి చేసిన అలాంటి సినిమాలు పరాజయం పాలైతే, వాళ్ళ హృదయం బద్దులు కావడం ఖాయం. కానీ కొన్ని సార్లు ఆ ఘోర పరాజయాలను మర్చిపోయి… మూవీ ఆన్ అవుతుండాలి. ప్రస్తుతం అభిషేక్ బచ్చన అదే చేస్తున్నాడు. అతను ‘ఐ వాంట్ టు టాక్’ కోసం చాలా కష్టపడ్డాడు. ప్రొస్థటిక్ మేకప్ కు ఆస్కారం ఇవ్వకుండా తనే బరువు పెరిగి, పాత్రకు తగ్గట్టు పొట్టను పెంచాడు. అందుకోసం చాలా కసరత్తే చేశాడు. తీరా ఆ సినిమా జనం ముందుకు వచ్చి పరాజయం పాలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో బోల్తా పడటంతో దర్శకుడు సూజిత్ సర్కార్ సైతం కంగుతిన్నారు. తాజాగా ఈ సినిమా రిజల్ట్ గురించి ఆయన మాట్లాడుతూ, ‘’నా స్థాయిలో ఓ కథను సినిమాగా తెరకెక్కించడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అయితే ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అంతమాత్రం చేత నిరాశ పడిపోకూడదనే పాఠాన్ని ‘ఐ వాంట్ టు టాక్’తో నేర్చుకున్నాడు. అప్పుడు థియేటర్లలో ఈ సినిమాను చూడవని వారు ఇప్పుడు ఓటీటీలో చూస్తున్నారు. మెచ్చుకుంటున్నారు. అది కొంత ఓదార్పును కలిగిస్తోంది’’ అని అన్నారు.
