Aarogyasri: ఆరోగ్యశ్రీ పథకం సేవలను ఆగస్టు నెల 31న అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్హెచ్ఏ) ప్రకటించింది. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన సర్కారు.. గత కొన్నాళ్లుగా బకాయిలను నిలిపివేసిందని టీఏఎన్హెచ్ఏ తెలిపింది. ఇప్పటి వరకు సుమారు 1400 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్టు టీఏఎన్హెచ్ఏ ప్రతినిధులు తెలిపారు. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
గతంలో రూ.5 లక్షలుగా ఉన్న ఆరోగ్య శ్రీ పరిమితిని రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.10 లక్షలకు పెంచారు. దీంతో పేదలు ఎంతో సంతృప్తి చెందుతుండగా, నెలలుగా ఆరోగ్య శ్రీ పథకం బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది.
ఇది కూడా చదవండి: Rowdy Sheeter Srikanth: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చాను.. కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 నెలల క్రితం కూడా ఇలాగా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని టీఏఎన్హెచ్ఏ ఆందోళనతో స్పందించిన సర్కార్ నిధులను విడుదల చేసింది. మళ్లీ ఇప్పుడు 8 నెలలుగా పెండింగ్లో బకాయిలు ఉన్నట్టు తెలుస్తున్నది.
ఆగస్టు నెల 31 నుంచి ఆరోగ్య శ్రీతోపాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీములైన ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలను కూడా నిలిపివేత వర్తించనున్నట్టు తెలుస్తున్నది. బిల్లులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగుతున్నామని, కొన్ని చిన్న ఆసుపత్రులను మూసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని టీఏఎన్హెచ్ఏ ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.