Deepti Sharma: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు క్రీడాకారిణులు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ తమను వ్యక్తిగతంగా గమనించి, ఆరా తీయడం పట్ల ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సంతోషం వ్యక్తం చేసింది. “నా చేతిపై ఉన్న హనుమాన్ టాటూ గురించి, అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘జై శ్రీరామ్’ అని రాసి ఉండటం గురించి ప్రధాని నన్ను అడిగారు. నా వ్యక్తిగత విశ్వాసాల గురించి ఆయనంతటి వ్యక్తి అంత లోతుగా తెలుసుకోవడం, దానిని ప్రస్తావించడం నాకు ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది అని తెలిపింది.
ఇది కూడా చదవండి: The Girlfriend Review: కోతగా రష్మిక.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ఎలావుందీ అంటే..?
ప్రధాని మోదీ వ్యక్తిగతంగా తన టాటూ గురించి అడిగి, హనుమాన్ టాటూ నీకెలా ఉపయోగపడుతుందని ప్రశ్నించినట్లు దీప్తి శర్మ తెలిపారు. దానికి ఆమె బదులిస్తూ, “నా కంటే నేను హనుమాన్‌ను ఎక్కువగా నమ్ముతాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ఆయన నామస్మరణ చేస్తే, ఆ కష్టాల నుంచి బయటపడతాననే నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకమే నా ఆటను మెరుగుపరుస్తుందని వివరించింది. టీమిండియా జట్టు వరుస వైఫల్యాల నుంచి పునరాగమనం చేసి ప్రపంచకప్ గెలవడంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల వ్యక్తిగత విషయాలు, వారి నమ్మకాలను ప్రస్తావించడం ద్వారా ప్రధాని మోదీ ఆటగాళ్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

