AAP defeat

AAP Defeat: ఒకటీ..రెండూ కాదు.. అవినీతి నుంచి యమునా మురికి వరకూ కేజ్రీవాల్ ఓటర్లకు దొరికిపోయారు!

AAP Defeat: ఢిల్లీ బీజేపీని ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదు ఎన్నికల నుంచి ఏడిపిస్తూ వస్తోంది. అక్కడి ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ జై కొట్టడం.. అసెంబ్లీ ఎన్నికల్లో నై చెప్పడం జరుగుతూ వస్తోంది.ఎలాగైనా ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ బీజేపీకి గత ఎన్నికల సమయంలో భంగపాటు తప్పలేదు. దేశమంతా బీజేపీ గాలి వీచినా.. దక్షిణాది రాష్ట్రాలతో పాటు, ఢిల్లీలో పాగా వేయాలనే బీజేపీ యత్నాలకు ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూనే వస్తున్నాయి. ఎలాంటి ప్రణళికలు చేసినా సరే.. ఎంత జాగ్రత్తగా పావులు కదిపినా ఢిల్లీలో ఆప్ ను దెబ్బతీయడం బీజేపీ వల్ల కాలేదు. కానీ, ఈసారి మాత్రం గురిని కొట్టడానికి సరైన ఆయుధాల్ని రెడీ చేసుకోవడమే కాకుండా వాటిని సరైన సమయంలో ప్రయోగించడంతో కూడా బీజీపీ సక్సెస్ అయింది.

ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యతను తెలివిగా వాడుకుంది బీజేపీ. ఎక్కడా తన కూటమి చెదరకుండా.. ఆ పార్టీల ఓట్లన్నీ పడేలా వ్యూహం రచించింది. అంతేకాదు.. కేజ్రీవాల్ – ఆప్ అవినీతిని సమర్ధవంతంగా ప్రజల ముందు నిరూపించగలిగింది. మన దేశ రాజకీయ వ్యవస్థలో జైలుకు వెళ్లివస్తే సీఎం అయిపోతారు అనేది నేతల నమ్మకం. సరిగ్గా ఈ నమ్మకంతోనే కేజ్రీవాల్ కూడా తన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుని.. అతిషి సింగ్ ను సీఎం చేసి సానుభూతి సాధించాలని ప్రయత్నం చేశారు. అయితే, బీజేపీ ఆ సానుభూతి రాకుండా శేషమహల్ అంశంతో కేజ్రీవాల్ ను ఇరికించేసింది. ప్రజలకు ఇళ్ళు లేవు కానీ.. ముఖ్యమంత్రికి కోట్లాది రూపాయల బంగ్లానా అంటూ బీజేపీ చేసిన ప్రచారం పశుపతాస్త్రంలా ఓటర్లపై పనిచేసినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

కేజ్రీవాల్ తన ప్రచారంలో బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలీదు అంటూ స్పీచులు దంచి కొట్టారు. కానీ ముఖ్యమంత్రి ఎవరనేది కాదు.. ఎలాంటి వారు అనేదే ముఖ్యమని తేల్చేశారు ఢిల్లీ ఓటర్లు. అసలు కేజ్రీవాల్ ఆ మాటను ఎక్కడా లెక్కలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. మరోవైపు బీజేపీ కేజ్రీవాల్ అవినీతి అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చింది. ఎక్కడికక్కడ కేజ్రీవాల్ అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ వచ్చింది. యమునా నది కాలుష్యం విషయంలో సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కేజ్రీవాల్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తాను అధికారంలో ఉన్నన్ని రోజులు యమునా నది ప్రక్షాళన ఊసే ఎత్తని కేజ్రీవాల్ దానిని ఎన్నికల ప్రచారాంశంగా తెరపైకి తీసుకురావడం బూమరాంగ్ అయింది. పైగా పక్కనే ఉన్న హర్యానా బీజేపీ ప్రభుత్వాన్ని ఇందులోకి లాగి.. యమునా నీళ్లు విషపూరితం చేస్తున్నారంటూ దారుణమైన పాచిక వేశారు. కానీ, ఇది అసలు ఫలించకపోగా.. అనవసర చిక్కులు తెచ్చిపెట్టింది. కోర్టులు కూడా ఈ వ్యాఖ్యల విషయంలో సీరియస్ అయిన పరిస్థితి వచ్చింది.

ఇది కూడా చదవండి: Delhi Assembly Elections 2025: తెలంగాణ కేసీఆర్‌.. ఢిల్లీలో కేజ్రీవాల్‌.. ఓట‌మికి ఇదే కార‌ణ‌మా?

మొత్తంగా చూసుకుంటే.. ఉచిత పథకాలతో పేదల తిండికి భరోసా కల్పిస్తామన్న బీజేపీ శేష్ మహల్ విషయంలో పేదలకు ఇల్లు లేకుండా ముఖ్యమంత్రి అద్దాల మేడలు కట్టుకున్నారంటూ గూడుపై వేసిన సెంటిమెంట్ బాణం.. అన్నిటినీ మించి అవినీతి విషయంలో స్పష్టంగా చేసిన ఆరోపణలు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాయి. వీటికి తోడుగా సరిగ్గా ఎన్నికల ముందు బడ్జెట్ లో టాక్స్ రిలాక్సేషన్ ప్రకటనలు కూడా బీజేపీ అనుకూల పవనాల్ని మోసుకొచ్చాయి. మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో పన్ను మినహాయింపు వార్త రిలీఫ్ ఇచ్చింది. అది ఓట్లుగా బీజేపీ హుండీని నింపింది.

చివరిగా.. వీటన్నిటికీ మించి కాంగ్రెస్ బీజేపీ నెత్తిన పాలు పోసిందని చెప్పవచ్చు. నువ్వా.. నేనా అన్నట్టు సాగాల్సిన ఎన్నికలు ఏకపక్షంగా కాదు.. కాదు.. బీజేపీ పక్షంగా సాగేలా చేసింది మాత్రం కాంగ్రెస్ అనేది సుస్పష్టం. ఇండియా కూటమి బద్దలు కావడంతో ఓట్ల చీలిక పెద్ద దెబ్బ అయింది కేజ్రీవాల్ కి. దీంతో పాటు యమునా నది విషయంలో కేజ్రీవాల్ పెట్టుకున్న ఆశల్ని రాహుల్ గాంధీ యమునా మురికిలోనే ముంచేశారు. ఒకపక్క కేజ్రీవాల్ బీజేపీకి ఆ మారక అంటించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క రాహుల్ గాంధీ ఈపాపం మా పాత మిత్రుడు కేజ్రీవాల్ దే అని చెబుతూ పోయారు. దీంతో విజ్ఞులైన ఢిల్లీ ఓటర్లు అసలు విషయాన్ని బాగానే గ్రహించారు. ఏదిఏమైనా కేటీఆర్ చెప్పినట్టు బీజేపీని గెలిపించడంలో ప్రధాన పాత్ర రాహుల్ దే!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *