Aanam venkataramana reddy: మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గంజాయి, పోలీసులపై హత్యాయత్నాలు, మహిళలపై లైంగిక దాడులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని జగన్ “చిన్నపిల్లకాయలు”గా పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “ఇంతటి ఘోర నేరాలు చేసినవాళ్లను చిన్నపిల్లలుగా అంటావా? అలా అయితే నీవు కూడా చిన్నపిల్లవాడివేనా జగన్ రెడ్డి?” అంటూ కఠినంగా ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆనం తీవ్రంగా తప్పుబట్టారు. “మా నాయకుడిని రోడ్డుపై కొట్టాలన్నావు కదా… మరి నిన్ను దేనితో కొట్టాలి? విచారణకు హాజరుకాకుండా 31 కేసులపై వాయిదాలు తీసుకుంటూ తిరుగుతున్న నిన్ను చెప్పుతో కొట్టాలా?” అంటూ మండిపడ్డారు.
ఒక సంవత్సరం వైసీపీ అధికారానికి దూరమైనా జగన్ ప్రవర్తనలో మార్పు లేదని, ఎవరిని ఎవరితో పోల్చాలో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. తన హయాంలో కేసులు పెట్టిన వ్యక్తులను పరామర్శించడానికి తెనాలి వెళ్లినప్పుడు, స్థానికులు “సీఎం” అని కాదు “ఛీఎం” అని వెక్కిరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
జగన్ తన కార్యకర్తలకు ఎలాంటి విలువలు నేర్పుతున్నాడని ప్రశ్నించిన ఆనం, “రేప్‌లు చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసులపై దాడి చేయండి… మీరు జైలుకు వెళితే నేనే వస్తాను అంటూ ప్రోత్సహిస్తున్నారా?” అని నిలదీశారు. పోలీసులపై విమర్శలు చేయడం అనుచితమని పేర్కొన్నారు. మంత్రి అంబటి రాంబాబుకు కూడా ఆయన హెచ్చరిక చేశారు – “పోలీసులను చూసి పళ్లు కొరుకుతానన్నావు కదా, పళ్లు ఊడగొడతారు, జాగ్రత్త!”
చంద్రబాబును రోడ్డుపై కొట్టాలన్న జగన్ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌పై నమోదైన కేసులకు ఇప్పటి వరకు 5,000 రోజులు పూర్తయ్యాయని, నిజంగా నిర్దోషి అయితే కోర్టులో న్యాయపూర్వకంగా పోరాడి నిరూపించుకోవాలని సవాలు విసిరారు.
ఇప్పటివరకు 3,452 సార్లు కోర్టు వాయిదాలు తీసుకున్న జగన్, తన లీగల్ ఫీజుల కోసం రూ.6,904 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు. “రోజుకు కోటి 39 లక్షలు ఖర్చు చేస్తూ బయట తిరుగుతున్నావు. నీ మీద ఉన్న కేసులు తేల్చుకునే ధైర్యం లేకపోతే మా నాయకుల మీద మాట్లాడే హక్కు నీకు లేదు,” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చివరగా, “ఆరు నెలల్లో నా కేసులు తీర్చాలని కోర్టును అడిగే ధైర్యం నీకు ఉందా జగన్ రెడ్డి?” అంటూ సూటిగా ప్రశ్నించారు.