Medak: నేటి కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చదువులో ఒత్తిడి, ప్రేమలో విఫలం కావడం లేదా ఇంట్లో చిన్న మాట అంటే చాలు.. క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లాలోని హావేలిఘనపూర్ మండలం ముత్తాయిపల్లి గ్రామంలో ఇలాంటి ఒక బాధాకరమైన సంఘటన వెలుగు చూసింది. మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడవద్దని తల్లి మందలించడమే ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ముత్తాయిపల్లికి చెందిన శిరీష (19) గత కొంతకాలంగా మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ వాటికి పూర్తిగా బానిస అయిపోయింది. రోజులో ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతూ ఉండటంతో ఆమె ఆరోగ్యం మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, తల్లి మరోసారి ఆమెను గట్టిగా మందలించింది.
తల్లి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష, ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఆరోగ్యం విషమించడంతో శిరీష కన్నుమూసింది. కళ్లముందే ఉన్న కూతురు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
