Viral News: పెద్దలు తమ ప్రేమను ఎక్కడ కాదనరో అని భయపడి, రహస్యంగా పెళ్లి చేసుకున్న ఒక ప్రేమ జంటకు ఊహించని కష్టం ఎదురైంది. యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోతూ యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.
అసలేం జరిగిందంటే?
ఔరైయా జిల్లా రాంపూర్‌కు చెందిన ఉపేంద్ర అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకున్నారు. తమ వివాహానికి పెద్దలు అంగీకరించరనే భయంతో, స్నేహితుల సాయంతో ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం తమ దారి తాము చూసుకుందామని భావించిన ఆ జంటకు యువతి తరపు బంధువుల రూపంలో ప్రమాదం ఎదురైంది.
ఇది కూడా చదవండి: Droupadi Murmu: పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ‘పారదర్శకత’ ప్రాణం..
విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఉపేంద్రను పట్టుకుని ఊరి మధ్యలో ఉన్న ఒక చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా చితకబాదారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. అందరూ చూస్తుండగానే ఉపేంద్ర మెడలో చెప్పుల దండ వేసి, వీధుల్లో ఊరేగించి అవమానించారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఉపేంద్రను రక్షించారు. ఈ అమానుషానికి ఒడిగట్టిన యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

