Nalgonda

Nalgonda: మిర్యాలగూడలో విషాదం.. నీళ్లని భ్రమపడి కెమికల్ తాగిన యువకుడు మృతి

Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. దాహం తీర్చుకోవడానికి తాగిన నీళ్లే ఒక యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. మంచినీళ్లు అనుకొని పొరపాటున ప్రమాదకరమైన కెమికల్ తాగడంతో 19 ఏళ్ల గణేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన గణేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం తన తల్లితో కలిసి మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్ వేసుకోవడానికి నీళ్లు అవసరమయ్యాయి. అయితే, ఆ సమయంలో పక్కనే ఉన్న మంచినీళ్ల క్యాన్‌లో నీళ్లు లేవు. దాంతో అక్కడే ఉన్న మరో క్యాన్‌లో ద్రవం ఉండటం చూసి, అది మంచినీళ్లేనని గణేష్ తల్లి భావించింది.

నిజానికి ఆ క్యాన్‌లో ఉన్నది ఆసుపత్రి శుభ్రం చేయడానికి ఉపయోగించే ప్రమాదకరమైన రసాయనం. ఆ విషయం తెలియని తల్లి, దాన్ని బాటిల్‌లో నింపి తన కుమారుడికి ఇచ్చింది. అది తాగిన వెంటనే గణేష్ తీవ్ర అస్వస్థతకు గురై విలవిలలాడిపోయాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆసుపత్రికి వెళ్లేలోపే మార్గమధ్యలో గణేష్ ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కొడుకు ప్రాణాలు పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *