Crime News: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బరాత్‌లో భాగంగా పెళ్లి కుమారుడు స్వయంగా కారు డుపుతుండగా అదుపుతప్పి అక్కడే ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రమాద వివరాలు: కేశవపట్నం ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం, మెట్‌పల్లికి చెందిన బకారపు ప్రభాకర్ కుమార్తె నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో మార్చి 6న జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి బరాత్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వధూవరులతో పాటు మరికొందరు ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ నడుపుతుండగా, ఫోన్ కాల్ రావడంతో కారు ఆపి రోడ్డుపక్కకు వెళ్లి మాట్లాడటం ప్రారంభించాడు. ఈ సమయంలో పెళ్లి కుమారుడు అశోక్ కారు స్టార్ట్ చేసి నడపడంతో అది అదుపు తప్పి వేగంగా దూసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: Gold Smuggling: పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..
గాయాలైనవారు: ప్రమాద సమయంలో బరాత్‌లో పాల్గొంటున్న 12 మందిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బకారపు ఉమ తీవ్రంగా గాయపడగా, ఆమె కుమార్తెతో పాటు మరికొంత మందికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలించే క్రమంలో ఆమె మృతి చెందారు.
పోలీసుల చర్యలు: ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పెళ్లి ఇంట్లో విషాదాన్ని నింపగా, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి వేడుకలోనే ఇలా అనుకోని ప్రమాదం జరగడం కుటుంబసభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.