Brave Woman Without Arms

Brave Woman Without Arms: చేతుల్లేని వీర వనితకు ప్రశంసల వెల్లువ

Brave Woman Without Arms: భారత పారా ఆర్చర్ (దివ్యాంగ విలుకారి) శీతల్ దేవి అసాధారణమైన ఘనతలతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా, ఆమె తన కాళ్లు మరియు గడ్డం సహాయంతో బాణాలను సంధించి అంతర్జాతీయ వేదికలపై సాధించిన విజయాలు.. ఆమెను అత్యంత స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిపాయి. ఆమె గొప్పతనాన్ని, పట్టుదలను కీర్తిస్తూ దేశవ్యాప్తంగా, క్రీడా ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఇటీవల దక్షిణ కొరియాలోని గ్వాంగ్‌జూలో జరిగిన పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ నంబర్ 1 ఒజ్నూర్ క్యూర్ గిర్డిని ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించారు. రెండు చేతులు లేని మహిళా ఆర్చర్‌గా ఈ ఘనత సాధించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.

2022 ఆసియా పారా గేమ్స్‌లో ఆమె రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని గెలుచుకున్నారు. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచి, అత్యంత పిన్న వయస్కురాలైన పతక విజేతగా చరిత్ర సృష్టించారు. శీతల్ దేవి స్ఫూర్తిదాయకమైన కథకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు శీతల్ దేవి పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్నారు. ఆమె విజయాలు దేశ యువతకు, ముఖ్యంగా దివ్యాంగులకు గొప్ప ప్రేరణ అని కొనియాడారు.  తాజాగా, వైకల్యం లేని సాధారణ ఆర్చర్లతో కలిసి త్వరలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3 పోటీల్లో పాల్గొనే జూనియర్ జట్టుకు శీతల్ ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: సౌరవ్ గంగూలీని ఆపడం ఎవరి తరమూ కాదు

పారా ఆర్చర్ సాధారణ ఆర్చర్ల జట్టుకు ఎంపిక కావడం భారత్‌లో ఇదే తొలిసారి. ఈ చారిత్రక ఎంపిక పట్ల క్రీడా లోకం ఆనందం వ్యక్తం చేసింది. చేతులు లేని ఏకైక మహిళా ప్రపంచ ఛాంపియన్‌గా ఆమె సాధించిన ఘనతను ప్రపంచ క్రీడా సంస్థలు మరియు అభిమానులు మానవాళి చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన అథ్లెట్ గా అభివర్ణిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతం నుండి వచ్చిన శీతల్, పేదరికం, శారీరక సవాళ్లను లెక్క చేయకుండా తన పాదాలు గడ్డం సహాయంతో విలువిద్యను సాధన చేసి, ప్రపంచ స్థాయికి ఎదగడం నిజంగా అద్భుతమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె విజయగాథ ఎంతోమందికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *