NTR War 2: ‘దేవర’ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా ‘వార్ 2’. జూనియర్ మొట్ట మొదటి హిందీ చిత్రమిది. హృతిక్ తో కలసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా తెలుగు టైటిల్ గురించి ఆసక్తికరమైన విషయం ప్రచారంలో ఉంది. తెలుగులో ‘వార్2 – యుద్ధ భూమి’ అనే టైటిల్ ని పెట్టబోతున్నట్లు వినిపిస్తోంది. షూటింగ్ ఆరంభానికి ముందు హృతిక్ కూడా సోషల్ మీడియా చాట్ లో ‘యుద్ధ భూమి’ అని ప్రస్తావించటం తెలుగు టైటిల్ ఇదే అనటానికి బలం చేకూర్చుతోంది. గతంలో ‘యుద్ధ భూమి’ టైటిల్ తో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా డిజాస్టర్ కావటం జూనియర్ అభిమానులు యాంటీ సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. అయితే ఇక్కడ అది కేవలం ట్యాగ్ లైన్ కాబట్టి ఆ సెంటిమెంట్ పని చేయదనే వారు లేకపోలేదు. ఇటీవల ‘దేవర’తో సోలో హీరోగా తన కెరీర్ లో హైయెస్ట్ వసూళ్ళను అందుకున్నాడు యంగ్ టైగర్. మరి ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ తో కలసి వస్తున్న ‘వార్2’తో ఏ స్థాయి విజయాన్ని నమోదు చేస్తాడో చూడాలి.
