Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “హరిహర వీరమల్లు” చివరికి జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నోసార్లు షూటింగ్ ఆలస్యం, రిలీజ్ డేట్లు మారినా.. అన్ని అడ్డంకులను దాటుకొని సినిమా సిద్ధమైంది.
తాజాగా సినిమా నిర్మాత రత్నం మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
సినిమాపై ఒత్తిడి ఎక్కువగా ఉంది
“ఏ రోజూ ఈ సినిమా ఎందుకు చేశానా అనిపించలేదు. కానీ రెండు మూడు రోజులుగా మాత్రం ప్రెషర్‌గా అనిపిస్తోంది. సినిమా టికెట్ రేట్ల గురించి, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ గురించి చర్చిస్తున్నారు. కొందరు ‘ఈ సినిమా వస్తుందా రాదా?’ అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది బిజినెస్ కాబట్టి ఈ చర్చలు సహజమే” అని ఆయన అన్నారు.
టార్గెట్ చేస్తున్నారా..?
“కొంతమంది మా సినిమాని టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ అది రాజకీయంగానా..? లేక సినిమా కారణంగానా..? తెలియడం లేదు. ఎవరినీ బ్లేమ్ చేయదలచుకోలేదు. ఎవరికి వారికే ఉద్దేశాలు ఉంటాయి” అని నిర్మాత వ్యాఖ్యానించారు.
పవన్‌తో కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటే చేసేవాణ్ని
“డబ్బుల కోసమే అయితే పవన్ కళ్యాణ్ గారితో వేదాళం రీమేక్ చేసి, రెండు మూడు కమర్షియల్ సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకునేవాణ్ని. కానీ మేము ప్యాషన్‌తో ఈ సినిమా చేస్తున్నాం” అని రత్నం అన్నారు.
ఇది కూడా చదవండి: Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు
చారిత్రక నేపథ్య కథ
“హరిహర వీరమల్లు 17వ శతాబ్దం నేపథ్యంలో సాగిన పూర్తి ఊహాజనితమైన చారిత్రక కథ. ఇది ఏ వ్యక్తి జీవిత కథ కాదు. తప్పులు వెతకడం కోసం కాకుండా.. వినోదం కోసం సినిమా చూడండి. తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పారు.
టికెట్ రేట్లు, పెయిడ్ ప్రీమియర్స్
“కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమా తీస్తున్నప్పుడు 100 రూపాయలకి టికెట్ అమ్మడం సాధ్యం కాదు. బడ్జెట్‌కి తగ్గట్టుగానే టికెట్ రేట్లు ఫిక్స్ చేయడం తప్పు కాదు. ఎవరినీ బలవంతం చేయడం లేదు కదా థియేటర్లకు రమ్మని. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ కోసం అప్లై చేశాం. జూలై 23 రాత్రి 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం” అని రత్నం తెలిపారు.
వైజయంతి మూవీస్ సంస్థ “ఛాంపియన్” కోసం వేసుకున్న సెట్ ను మా హరిహర వీరమల్లు కోసం ఇచ్చారు. ఈ విషయంలో దత్తుగారి అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పాలి.
హరిహర వీరమల్లు సినిమా చూసాక ప్రతి ఒక్కరు కచ్చితంగా.. రత్నం మంచి సినిమా చేసావయ్యా, శభాష్! అంటారు.