Fire Accident

Fire Accident: అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం

Fire Accident: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎస్‌వీఎస్అనే ఫార్మా పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేగింది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీ లోపల సుమారు 14 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు మరియు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆమె ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా పరిశ్రమల్లో కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *