Viral News: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అత్యంత హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో మరణించిన తన కుమారుడికి అంత్యక్రియలు చేసేందుకు కూడా డబ్బులు లేక, ఓ నిరుపేద తండ్రి స్మశానం వద్ద మృతదేహాన్ని పట్టుకుని ఎనిమిది గంటలకు పైగా కన్నీరుమున్నీరుగా విలపించాడు.
దారిద్ర్యంలో దివ్యాంగుడి మృతి
జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగించేవాడు. గతంలో స్థానికంగా ఉన్న ఒక పత్తి మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, ఇటీవల పత్తి మిల్లు మూతపడడంతో బాలరాజ్ ఉపాధి కోల్పోయాడు.
ఈ ఆర్థిక కష్టాల నేపథ్యంలో, బాలరాజ్ భార్య, భర్తను, దివ్యాంగుడైన పెద్ద కుమారుడు హరీష్ (8)ను వదిలేసి, చిన్న కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో బాలరాజ్ స్థానికంగా ఒక హోటల్‌లో చిన్న పని చేస్తూ హరీష్‌ను పోషిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Rahul Sipligunj Wedding: పెళ్లి తేదీ ఫిక్స్.. మీరు తప్పకుండా రవళి.. సీఎంని ఆహ్వానించిన రాహుల్
ఈ క్రమంలోనే, పెద్ద కుమారుడు హరీష్ (8) తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యానికి చికిత్స చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో, వైద్యం అందక బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక, తండ్రి బాలరాజ్ స్మశానంలో హరీష్ మృతదేహాన్ని పట్టుకుని, “బతికున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను” అంటూ గుండెలవిసేలా రోదించాడు.
వ్యసనాలపై స్థానికుల ఆరోపణలు
బాలరాజ్ దయనీయ పరిస్థితిపై స్థానికులు కొంతమంది విమర్శలు చేస్తున్నారు. బాలరాజ్‌కు తాగుడు అలవాటు ఉందని, తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. బాలరాజ్ తాగుడు అలవాటు కారణంగానే కుటుంబ జీవితం దారుణంగా మారిందని, ఆ బాధ భరించలేకే భార్య పిల్లలను వదిలేసి వెళ్లిపోయిందని చెబుతున్నారు.
ఆ బాబుకు రెండు నెలలుగా సరిగా భోజనం అందలేదని, నిత్యం బాలరాజ్ తాగి పడుకోవడంతో, దివ్యాంగుడైన ఆ బాలుడిని చూసుకునే వారు లేక ఆహారం కొరత, అనారోగ్యం కారణంగానే మృతి చెందాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారిద్య్రం, ఉపాధి కోల్పోవడం ఒక కారణం కాగా, బాలరాజ్ వ్యసనాలు ఈ విషాదానికి మరో కారణంగా నిలిచాయని స్థానికులు విశ్లేషిస్తున్నారు.
