Dil Raju: గత కొన్నేళ్ళుగా తాను ఆశించిన విజయాలు దక్కడం లేదని, ఎక్కడో ఏదో పొరపాటు జరగడంతో నూరు శాతం విజయాన్ని తాను అందుకోలేక పోయానని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. ఆ లోటును తీర్చుతూ ‘గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో గ్రాండ్ విక్టరీని సాధిస్తాననే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ‘పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం నుండి తాను స్ఫూర్తి పొందానని, వైఫల్యాలు వచ్చినా కృంగిపోకుండా మరింతగా కృషి చేయాలనే తత్త్వాన్ని అలవరచుకున్నానని అన్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకునే సౌలభ్యాన్ని కలిగించారని, తెలంగాణలోనూ ఓ నిర్మాతగా సీఎంను కలిసి టిక్కెట్ రేట్ల విషయం మాట్లాడతానని, తుది నిర్ణయం ప్రభుత్వానిదే అని దిల్ రాజు తెలిపారు. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’నూ నైజాంలో తాను విడుదల చేస్తున్నానని, అన్ని సినిమాలకు సమన్యాయం ప్రకటిస్తానని చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి వెనక్కి వెళుతూ చనిపోయిన ఇద్దరు అభిమానులకు చెరొక ఐదు లక్షల చొప్పన ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు.
