Sangareddy: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సీడ్ ఫ్యాక్టరీలో ఇన్‌చార్జిగా పనిచేస్తున్న మాలే నారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని గోనెసంచిలో మూటగట్టి హత్నూర మండలం పల్పానూర్ గ్రామ శివారులో పడేశారు. ఈ ఘటన జరిగి రెండు మూడు రోజులు కావడంతో మృతదేహం నుంచి విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. దీంతో అటువైపుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలు సేకరించారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన మాలే నారాయణగా పోలీసులు గుర్తించారు.
అతడు గత కొన్నాళ్ల క్రితం సంగారెడ్డికి ఉపాధి కోసం వలసవచ్చి సీడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. మృతుని భార్యకు వివాహేతర సంబంధం ఉన్న కారణంగా నారాయణ హత్య జరిగినట్లు సమాచారం. ప్రియుడి మోజులో పడిన భార్య ప్లాన్ ప్రకారమే తన భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. ప్రియుడు మరో ముగ్గురితో కలసి ఆమె తన భర్తను చంపించినట్లు సమాచారం.
ఈ వ్యవహారమంతా జరిగిన తర్వాత మృతుని భార్య మూడు రోజుల క్రితం హత్నూర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తన భర్త మిస్ అయ్యాడని కేసు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి భార్య లక్ష్మితో పాటు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురి వ్యక్తులను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈ ఘటన మరవకముందే మరో ఘటన తెలంగాణలోనే జరగడం సంచలనంగా మారింది.. జయశంకర్ భూపాలపల్లిలో ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. ప్రియుడి కోసం భర్తను బలి తీసుకుంది భార్య.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని విషమిచ్చి భర్త సురేష్‌ను భార్య స్వప్న చంపేసింది. తర్వాత ఏమీ తెలియనట్లు బంధువుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మృతుని తల్లి సుగుణ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో భార్య భాగోతం బయటపడింది.

