Indigo: ఇటీవల ఇండిగో విమాన సర్వీసుల్లో వచ్చిన పెద్ద అంతరాయం కారణంగా ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. విమానాలు రద్దు కావడం, ఆలస్యం అవ్వడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అయితే, ఇప్పుడు ఇండిగో సంస్థ నష్టపోయిన ప్రయాణికులకు ఊరట కల్పించే చర్యలు తీసుకుంటోంది.
విమాన సర్వీసుల రద్దు కారణంగా, నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు 9,55,591 టికెట్లు రద్దు అయ్యాయి. వీటి మొత్తం విలువలో దాదాపు రూ.827 కోట్లను ఇండిగో ఇప్పటికే ప్రయాణికులకు తిరిగి చెల్లించింది. అలాగే, డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు కూడా 5,86,705 టికెట్లు రద్దు కాగా, ఆ మొత్తం రూ.570 కోట్లు కూడా ప్రయాణికులకు అందించినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అంటే, మొత్తం కోట్లాది రూపాయల రీఫండ్ ప్రక్రియను ఇండిగో వేగవంతం చేసింది.
ఇక విమానాలు రద్దు అవ్వడం వల్ల ఎయిర్‌పోర్టుల్లో ఆగిపోయిన బ్యాగేజీల సమస్య కూడా ఉంది. దాదాపు 9,000 బ్యాగులు వివిధ ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోగా, వాటిలో ఇప్పటికే 4,500 బ్యాగులను ప్రయాణికులకు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన బ్యాగులను కూడా రాబోయే 36 గంటల్లో డెలివరీ చేసేందుకు ఇండిగో ఏర్పాట్లు చేస్తోంది. అంటే, ఆగిపోయిన బ్యాగులలో సగం వరకు ప్రయాణికులకు చేరినట్లే. సోమవారం ఒక్కరోజే సుమారు 500 విమాన సర్వీసులు రద్దు అయినట్లు సమాచారం.
ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి ఇండిగో సంస్థ మాతృసంస్థ అయిన ‘ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్’ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో ‘క్రైసిస్ మ్యానేజ్‌మెంట్ గ్రూప్’ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ప్రధానంగా మూడు విషయాలపై దృష్టి పెడుతుంది: విమాన కార్యకలాపాలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడం, ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడం, అలాగే రీఫండ్ ప్రక్రియ, బ్యాగేజీల డెలివరీని వేగవంతం చేయడం. ఈ చర్యల ద్వారా ఇండిగో మళ్లీ తన సర్వీసులను పూర్తిస్థాయిలో మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తోంది.

