Indigo: ఇంకా హైదరాబాద్ లో 100కు పైగా విమానాల రద్దు

Indigo: హైదరాబాద్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. వరుసగా ఏడో రోజూ విమానాల రద్దు కొనసాగుతుండగా, సోమవారం ఒక్కరోజే సంస్థ మొత్తం 112 సర్వీసులను రద్దు చేసింది. దీంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 

డిసెంబర్ 2 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మాత్రమే ఇండిగో 600కు పైగా విమానాలను రద్దు చేసిన విషయం గమనార్హం. ఆదివారం 126 సర్వీసులు రద్దు కాగా, డిసెంబర్ 5న అత్యధికంగా 155 విమానాలు నిలిపివేయబడ్డాయి. వరుసగా ఐదు రోజులు రద్దయిన సర్వీసుల సంఖ్య 100 దాటడం ప్రయాణికుల్లో ఆందోళన పెంచింది. అకస్మాత్తుగా విమానాలు రద్దు కావడంతో వందలాది మంది ఎయిర్‌పోర్ట్‌లోనే ఇరుక్కుని సిబ్బందిని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏవైనా అపశ్రుతులు జరిగే అవకాశంతో సీఐఎస్ఎఫ్ భద్రతను పెంచింది.

 

ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, గోవా వంటి ప్రధాన మార్గాల్లో ఇండిగో సర్వీసులు నిలిచిపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. కొత్తగా అమల్లోకి వచ్చిన FDTL (Flight Duty Time Limit) నిబంధనల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని ఇండిగో చెబుతోంది. పైలట్ల విశ్రాంతి సమయం పెరగడం వల్ల క్రూ అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణంగా సంస్థ పేర్కొంది.

 

ప్రయాణికులకు కొంత ఊరటనిస్తూ, డిసెంబర్ 15 వరకు బుకింగ్‌లపై రద్దు, రీషెడ్యూలింగ్ ఛార్జీలు వసూలు చేయబోమని ఇండిగో ప్రకటించింది. ఇదే సమయంలో, సంస్థ అభ్యర్థన మేరకు డీజీసీఏ ఫిబ్రవరి 10 వరకు FDTL నిబంధనలపై తాత్కాలిక సడలింపులు ఇచ్చింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *