Hyderabad: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సినీ నటుడు నాగార్జునతో పాటు దేశ–విదేశాల నుంచి పలు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన అతిథులను ‘రోబో’ ద్వారా ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహించబడుతోంది. రెండు రోజులపాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సదస్సు ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ తల్లి’ డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సదస్సులో తెలంగాణలో ప్రజా పాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, ‘విజన్ 2047’ లక్ష్యాలు, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించనున్నారు. పలు దేశాల పెట్టుబడిదారులు తెలంగాణపై ఆసక్తి చూపుతుండడంతో ఈ సదస్సు కీలకంగా మారింది.

