Ram Mohan Naidu: దేశంలో ఇటీవల ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన తీవ్ర అంతరాయం, విమానాల రద్దుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఇండిగో సంస్థ అంతర్గత నిర్వహణ లోపమే తప్ప, కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యానికి కేంద్రం చింతిస్తోందని, సమస్యను పరిష్కరించడానికి ఎయిర్‌లైన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలిపారు.
ఎఫ్డీటీఎల్ నిబంధనలు: సమస్యకు కారణం కాదు
విమాన సిబ్బంది పని వేళలకు సంబంధించిన కొత్త ఎఫ్డీటీఎల్ (Flight Duty Times Limitations) నిబంధనలు నవంబర్ 1వ తేదీ నుంచి రెండో దశలో అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలు రూపొందించే ముందు అన్ని వర్గాలతోనూ చర్చించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత నెల రోజులు పాటు విమాన సర్వీసులు సజావుగానే నడిచాయని, కానీ డిసెంబర్ 3వ తేదీ నుంచే ఇండిగోలో సమస్య మొదలైందని మంత్రి తెలిపారు.
పైలట్‌లకు విధులను కేటాయించే రోస్టరింగ్ విధానాన్ని ఇండిగో సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, సిబ్బంది సమస్యలు, విమానాల రద్దుకు దారితీసిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంతరాయాలకు ఏవియేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ (AMSS) లోపం కారణం కాదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు ఫైర్.. రుణమాఫీ అయితే రాజీనామాకు నేను సిద్ధం!
రద్దైన టికెట్లు, ధరల పర్యవేక్షణ
ఈ సంక్షోభం కారణంగా దాదాపు 5,86,700 విమాన టికెట్లు రద్దయ్యాయని మంత్రి తెలిపారు. ప్రయాణికులపై భారం పడకుండా టికెట్ ధరలు పెంచకుండా తాము పరిమితులు విధించామని, టిక్కెట్ల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దేశంలో ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, కొత్తగా పోటీ సంస్థలు ఏర్పాటయ్యేలా చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
ఇండిగో వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయడానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభకు తెలియజేశారు.

