Ashasvi Jaiswal: యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో అతను తన తొలి వన్డే సెంచరీని నమోదు చేయడంతో, అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లు – టెస్టులు, వన్డేలు, టీ20ఐలలో – సెంచరీ సాధించిన ఆరో భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 23 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ అద్భుతమైన ఫీట్‌తో.. సురేశ్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్న ఎలైట్ జాబితాలో చేరాడు. కేవలం తన నాలుగో వన్డే ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించడం అతని ప్రతిభకు నిదర్శనం.
Also Read: Cricket: సిరీస్ గెలిచిన భారత్..
ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలలో విఫలమైనప్పటికీ, నిర్ణయాత్మక మూడో వన్డేలో జైస్వాల్ తనదైన ముద్ర వేశాడు. 271 పరుగుల లక్ష్య ఛేదనలో అతను సంయమనం పాటిస్తూ, జట్టుకు బలమైన పునాది వేశాడు. రోహిత్ శర్మ (75)తో కలిసి తొలి వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముఖ్యంగా, తొలి 50 పరుగుల కోసం 75 బంతులు తీసుకున్న జైస్వాల్, ఆ తర్వాత కేవలం 35 బంతుల్లోనే తదుపరి 50 పరుగులు చేసి దూకుడు పెంచాడు. జైస్వాల్ 121 బంతుల్లో 116 పరుగులు (నాటౌట్) చేసి, తన తొలి వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అతని సెంచరీ, విరాట్ కోహ్లీ (65 నాటౌట్) తోడుగా భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

