Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత సింహాచలంలో ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అధికారులు మంత్రి కి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం, ప్రసిద్ధి చెందిన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం ఇచ్చారు. ముఖ్యంగా, త్వరలో రాబోయే వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను మంత్రి అనితదగ్గ రుండి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆలయాల పరిరక్షణ మరియు ప్రక్షాళనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఇటీవల విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలను చాలా వైభవంగా నిర్వహించామని, లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆమె గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో జరిగే ఇతర ప్రధాన ఉత్సవాలను కూడా అంతే ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హోం మంత్రి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు.
