Eatala Rajendar: భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా, గ్రామ సర్పంచులు గతంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని ఆయన మండిపడ్డారు.
ఈటల హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో పర్యటించారు. కమలాపూర్, భీంపల్లి, కన్నూరు, గుండెడు గ్రామాల్లో స్థానిక ఎన్నికల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి, ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు డబ్బులు కేవలం కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచే వస్తున్నాయని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా కేంద్రం ఇస్తున్న డబ్బులతోనే జరుగుతోందని ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో జరుగుతున్న అక్రమాల గురించి ఈటల ప్రస్తావించారు. కొంతమంది నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మనుషుల ఆత్మగౌరవానికి వెలకట్టలేరు అని ఆయన ప్రజలకు సూచించారు. తాను ఎప్పుడూ పేదల పక్షాన పోరాడే వ్యక్తిని అని, అధికారం ఉన్నా లేకున్నా, మీకు అవసరమైన సహాయం అందించే బాధ్యత తనదని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
