IndiGo Crisis: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు వరుసగా రద్దవుతుండటంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అకస్మాత్తు రద్దుల కారణంగా తమ గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలో తెలియక కంగారు పడుతున్న ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే రంగంలోకి దిగింది. రైల్వే శాఖ వారికి సహాయం అందించడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్ నుంచి చెన్నైకి, చర్లపల్లి నుంచి కోల్‌కతాకు, అలాగే హైదరాబాద్ నుంచి ముంబయికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఇంకా ఖాళీగా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 37 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా 116 కోచ్‌లను జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అదనపు బోగీలతో నడుస్తున్నాయి.
మరోవైపు, ఇండిగో విమానాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇండిగో విమానాల రద్దుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి పెట్టారని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విమానాలు రద్దు కావడానికి గల కారణాలపై ప్రభుత్వం పూర్తి దర్యాప్తు చేస్తుందని మంత్రి వివరించారు. అలాగే, టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, వారికి డబ్బులు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
