IndiGo Flights Crisis: డిసెంబర్-జనవరి అంటేనే ప్రయాణాలకు, వేడుకలకు కేంద్రం. ముఖ్యమైన పనులు, అత్యవసర సమావేశాలు, కుటుంబ వేడుకలు, పెళ్లిళ్లకు బయలుదేరే వారికి విమాన ప్రయాణం ఒక తక్షణ పరిష్కారం. కానీ, ఈ పీక్ సీజన్లో విమాన సర్వీసుల అంతరాయం, ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న దుస్థితి అందరినీ కలచివేస్తోంది.
గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక విమానాశ్రయాలు కన్నీటికీ, నిస్సత్తువకు నిలయాలుగా మారాయి. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణాలు ఆగిపోవడం, ముఖ్యమైన కార్యక్రమాలను కోల్పోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఆగిపోయిన పయనానికి ఆవేదన:
గంటలు కాదు, ఏకంగా ఐదు రోజులుగా విమాన ప్రయాణాలు లేక, వేచి చూస్తున్నవారి ఆవేదన వర్ణనాతీతం. కళ్ళ ముందు రద్దు అవుతున్న ఫ్లైట్ బోర్డులను చూసి, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తమ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. తమను పట్టించుకునే నాథుడే లేడంటూ, తాము పడుతున్న కష్టాన్ని తీర్చేదెవరు అంటూ వారు వ్యక్తం చేస్తున్న తీవ్రమైన నిరాశ సామాజిక మాధ్యమాలలో వీడియోల రూపంలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Sonu Sood: ఇండిగో విమానాల సంక్షోభం.. సపోర్ట్ చేస్తున్న సోనూసూద్
ఎక్కడికక్కడే నిద్ర: సమస్య పరిష్కారం ఏది?
డీజీసీఏ విధించిన ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తేసినా, క్షేత్రస్థాయిలో సమస్య ఏమాత్రం పరిష్కారం కాలేదు. ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో టికెటింగ్ కౌంటర్ల వద్ద, చెక్-ఇన్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కొందరు ప్రయాణికులు ఆకలి, నిద్ర లేమితో నీరసించి పోయి, ఫ్లోర్‌పైనే ఎక్కడికక్కడే పడుకుండిపోవడం ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది.
ఒక్కొక్కరిని కదిలిస్తే, వారి కళ్లల్లోంచి కన్నీళ్లు జాలువారుతున్నాయి. ఆఫీసు మీటింగ్, బంధువుల ఆరోగ్యం, పిల్లల చదువులు, చివరికి పెళ్లిళ్లకు కూడా సమయానికి చేరుకోలేకపోవడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
ప్రయాణికులు పడుతున్న ఈ దుర్భర కష్టాలను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి, విమానయాన సంస్థలతో సమన్వయం చేసి, త్వరగా సమస్యను పరిష్కరించాలని తీవ్ర దుఃఖంతో వేడుకుంటున్నారు. తమకు మెరుగైన ప్రత్యామ్నాయాలు, లేదా సరైన సమాచారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
