Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్‌లో జరిగిన విశాల ప్రజాసభలో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పదిేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి స్వంత ఆస్తుల పెంపుకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతున్నాం: సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ,
“కేసీఆర్ ఒకప్పుడు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని అన్నాడు. అది రైతు మనోభావాలను దెబ్బతీసిన మాట. కానీ మా ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే చర్యలు తీసుకుంది. వరి సహా పంటలకు ప్రోత్సాహకాలు, రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమే” అని తెలిపారు.
రైతు రుణమాఫీని మా ప్రభుత్వం పూర్తి చేసింది
“గత పాలకులు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పూర్తి చేశాం. రాష్ట్రంలో కోటి పది లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేశాం. 3 కోట్లు 10 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల పునరుద్ధరణతో పేదల ఆత్మగౌరవం
సీఎం రేవంత్ మాట్లాడుతూ,
“వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదలకు ఇచ్చారు. కానీ కేసీఆర్ పదేళ్లు సిఎంగా ఉన్నా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చెప్పి పేదలను మోసం చేశాడు. పేదల ఆత్మగౌరవం పెంచేందుకు 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మేము నిర్మించి అందిస్తున్నాం” అని తెలిపారు.
వరంగల్‌ను హైదరాబాద్ రేంజ్‌కు తీసుకువస్తాం
వరంగల్ అభివృద్ధి ప్రగతిపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు.
మార్చి 31లోపల వరంగల్ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
వరంగల్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను, ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
సౌర విద్యుత్ ఉత్పత్తి బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగిస్తున్నామన్నారు.
“హైదరాబాద్‌కు ఉన్న సదుపాయాలు వరంగల్‌కు కూడా వస్తాయి. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో ప్రధాన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.

