Pawan Kalyan: చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కోసారి ఉపాధ్యాయులను చూస్తే తనకు బాధేస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపితే కొంత సేపు ప్రశాంతం దొరుకుతుందని తల్లిదండ్రులు అనుకోవచ్చేమోగానీ, ఒకే గదిలో ఎన్నోమంది విద్యార్థుల అల్లరిని భరిస్తూ, వారిని క్రమశిక్షణలో పెడుతూ బోధించడమన్నది ఉపాధ్యాయులు ఎంత కష్టంతో చేస్తారో ఆలోచించాలని సూచించారు.
విద్యార్థులు గురువుల బాధ్యతను అర్థం చేసుకుని, వారిని గౌరవించాలని పవన్ హితవు పలికారు. కొన్నిసార్లు ఉపాధ్యాయులు విసిగిపోతారు, అవసరం అయితే చిన్నగా శిక్షిస్తారని, కానీ విద్యార్థులు వినయంగా ఉంటే గురువుల భారాన్ని సగం తగ్గించినట్టేనని వ్యాఖ్యానించారు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే గురువుల దీవెనలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితంలో ఉపాధ్యాయులదే అత్యంత ముఖ్యమైన పాత్ర అని పవన్ కల్యాణ్ అన్నారు. గురువులు దైవసమానులని కొనియాడిన ఆయన, ఆడపిల్లలకు ఉన్నత విద్య చాలా అవసరమని, చిన్న వయసులో పెళ్లి చేయాలనే ఆలోచనను పెద్దలు పూర్తిగా మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. జుబేదా, రిహానా వంటి ప్రతిభావంతులైన చిన్నారులు దేశానికి మేలుచేయగలరని, అలాంటి సందేశాన్ని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చేరవేయాలని కోరారు.
మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవడం అనివార్యమని పవన్ అభిప్రాయపడ్డారు. “Books are the training weights for your mind. ఒక లక్షమంది మెదళ్లను కదిలించే శక్తి చదువుకు ఉంది,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల పిఠాపురం పాఠశాలలో జరిగిన చిన్న గొడవను రాజకీయ ప్రయోజనాల కోసం కుల గొడవగా చూపించే ప్రయత్నం జరిగిందని, పిల్లల విషయాల్లో తల్లిదండ్రుల ప్రమేయం చాలా అవసరమని అన్నారు.
ఆడపిల్లలకు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యలు కూడా బాగా నేర్పించాలని, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయురాలు గౌస్యను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మరియు బలవర్థక ఆహారం అందుతున్నదని పేర్కొన్నారు. అంతేకాదు, పాఠశాలకు గది నిండా పుస్తకాలతో కూడిన లైబ్రరీ, 25 కంప్యూటర్ల ఏర్పాటు తనవంతు బాధ్యతగా చేపడతానని హామీ ఇచ్చారు.

