Manipur: మణిపూర్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమైన నేపథ్యంలో మొదలైన హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగమైన నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. 60 మంది సభ్యుల మణిపూర్ అసెంబ్లీలో ఎన్‌పిపికి 7 మంది సభ్యులు ఉన్నారు. వీరు బీజీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. బీజేపీకి 32 మంది సభ్యులు ఉన్నారు. అక్కడ అసెంబ్లీలో ప్రభుత్వానికి కావలసిన మెజారిటీ సంఖ్య 31గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంది.
మణిపూర్ పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా నాగ్‌పూర్‌లో నాలుగు ర్యాలీలను రద్దు చేసి ఢిల్లీకి తిరిగి వచ్చారు. రాష్ట్ర భద్రతా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. మణిపూర్ లో పరిస్థితిని సమీక్షించేందుకు సీఆర్ఫీఎఫ్ చీఫ్ అనిష్ దయాల్‌ను పంపించారు.
ఇది కూడా చదవండి: Badrinath Temple: బద్రీనాథ్ ఆలయం మూసివేత
Manipur: మరోవైపు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. హింసాకాండ కారణంగా, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 14న ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, జిరిబామ్, కాంగ్‌పోక్పి, బిష్ణుపూర్ జిల్లాల్లోని సెక్మాయ్, లాంసాంగ్, లామ్‌లై, జిరిబామ్, లీమాఖోంగ్, మొయిరాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో AFSPA చట్టాన్ని తీసుకువచ్చారు.
నవంబర్ 16న సీఎం ఎన్ బీరెన్ సింగ్, 10 మంది ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరిగాయి. అధ్వాన్నమైన పరిస్థితిని చూసి, 5 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను మూసివేశారు.
కాగా, బీరెన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కొందరు మంత్రులతో సహా 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి మరింత దిగజారితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.