Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు చారిత్రక హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌కు కనీసం ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న రోజులు పోయాయని, త్వరలోనే ఇక్కడ ఎయిర్‌బస్‌ను దించే, విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి, స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రూ.18.7 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాది లోపులోనే ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తమ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పాలన
ప్రజలు తమ ఓటును ఆయుధంగా వాడి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపి, ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుని నేటికి రెండేళ్లు పూర్తవుతోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ‘సంక్షేమం-అభివృద్ధి’ అనే రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని తెలిపారు. తాను చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా గొప్ప అవకాశం దక్కడం ప్రజల దీవెన, దేవుడి సంకల్పమని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించకుండా, సచివాలయంలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్ని చూశామని, తమ పాలనలో అలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం వైఫల్యం, ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరణ
తెలంగాణ ఏ ఆశయంతో సోనియాగాంధీ ఇచ్చారో అది గత పదేళ్లలో నెరవేరలేదని సీఎం విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్-2047’ అనే డాక్యుమెంటరీని రూపొందించామని, ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. ప్రారంభించినప్పటికీ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పక్కన పెట్టి లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, అది మూడేళ్లకే కూలిపోయిందని విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకోవడం వల్లే ఆ కుటుంబంలో ఇప్పుడు గొడవలు పడుతున్నారని అన్నారు. తాము మాత్రం అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దే నిర్మించి, ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందిస్తామని గట్టి హామీ ఇచ్చారు. అలాగే, ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తన పీసీసీ అధ్యక్షుడిగా పోరాటం ఇంద్రవెల్లి స్ఫూర్తితోనే మొదలుపెట్టానని, అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే దస్త్రంపై సంతకం చేశానని ఆయన గుర్తు చేశారు. ఈ సభలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

