KTR: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పరిశ్రమలకు గతంలో కేటాయించిన అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏకంగా రూ. 5 లక్షల కోట్ల విలువైన ఈ భూములను అక్రమంగా బదలాయించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, దీనిపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తుందని ప్రకటించారు.
తాజాగా కుత్బుల్లాపూర్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో పర్యటించిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న హిల్ట్ (HILT) పాలసీని, భూములను పారిశ్రామికవేత్తలకు బదలాయించే విధానాన్ని తప్పుబట్టారు.
ఆషాఢ సేల్ కాదు… ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం
ప్రభుత్వ చర్యలపై కేటీఆర్ ప్రధాన ఆరోపణలు ఇవే:
- భూముల విలువ పట్ల నిర్లక్ష్యం: జీడిమెట్ల ప్రాంతంలోని పారిశ్రామిక వాడలోనే సుమారు రూ. 75 వేల కోట్ల వరకు విలువ చేసే భూములు ఉన్నాయి. హైదరాబాద్‌లో భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ఈ భూములను రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30 శాతం చెల్లించి తమ సొంతం చేసుకోవచ్చని ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ‘ఆఫర్’ ఇస్తోంది. ఇది ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడమే కాదు, ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపేందుకు చేస్తున్న కుట్ర.
- ప్రజల అవసరాలను విస్మరించడం: ఈ విలువైన భూములను పేదల కోసం ‘ఇందిరమ్మ ఇళ్లు’ కట్టడానికి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడానికి, లేదా కాలుష్య నివారణకు గ్రీన్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఉపయోగించవచ్చు. కానీ, ప్రభుత్వం అవేవీ చేయడం లేదు. ఇళ్ల కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: TG High Court: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే పొడిగింపు.. జనవరి 29 వాయిదా!
- హిల్ట్ (HILT) పాలసీపై అనుమానాలు: కోకాపేటలో వందల కోట్ల ధర పలుకుతున్న గజం భూమి, జీడిమెట్లలో కేవలం రూ. కోటి అంటూ ధర నిర్ధారించడం ఎలా సాధ్యం? ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనే తప్ప, ప్రజా ప్రయోజనం ఇందులో లేదని కేటీఆర్ దుయ్యబట్టారు.
- భూకుంభకోణంలో భాగం కావొద్దు: పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కేటీఆర్ గట్టి హెచ్చరిక చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ ‘ఆషాఢ సేల్’ లాంటి ఆఫర్‌కు మోసపోవద్దని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే చట్టం తీసుకొచ్చి ఈ భూములను వెనక్కి తీసుకుంటుందని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి… అవినీతి అనకొండ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ‘అవినీతి అనకొండ’గా అభివర్ణించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు, దోచుకునేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ… ఐదు లక్షల కోట్ల విలువైన భూములను శాశ్వతంగా రాసిస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారు? అని సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కార్యాచరణ:
కేటీఆర్ ఈ భూ కుంభకోణంపై బీఆర్ఎస్ అనుసరించే కార్యాచరణను వివరించారు:
- క్షేత్రస్థాయి పోరాటం: హైదరాబాద్‌లో ప్రజలందరికీ అవగాహన కల్పించడం.
- సమావేశాలు: రౌండ్ టేబుల్ సమావేశాలు, అఖిల పక్ష సమావేశాలు నిర్వహించడం.
- న్యాయ పోరాటం: న్యాయస్థానాల్లో పోరాటం చేయడం.
- నిజ నిర్ధారణ: భూముల నిజ నిర్ధారణతో పాటు ధర నిర్ధారణ చేయడం.
- కార్మిక సంఘాలతో కలిసి పోరాటం: కార్మికుల ప్రయోజనాల కోసం పోరాటాన్ని ఉధృతం చేయడం.
చివరిగా, ‘హిల్ట్ భూముల విషయంలో ఇది ఆరంభం మాత్రమే, పోరాటం ఇంకా కొనసాగిస్తాం’ అని కేటీఆర్ గట్టి పిలుపునిచ్చారు. పేదల గుడిసెలను ‘హైడ్రా’ పేరిట తొలగిస్తూ, పెద్దవాళ్లకు మాత్రం కోట్లాది రూపాయల భూములు ధారాదత్తం చేయడం ప్రభుత్వ దోపిడీకి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

