Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులు సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్న (బుధవారం), ఇవాళ (గురువారం) భారీ స్థాయిలో ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 19కి చేరినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా అమరులయ్యారు.
భారీగా పెరిగిన మృతుల సంఖ్య
బీజాపూర్ అడవుల్లో బుధవారం ప్రారంభమైన ఎదురుకాల్పులు గురువారం కూడా భారీ స్థాయిలో కొనసాగాయి. భద్రతా బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.
నిన్న, ఇవాళ జరిగిన కాల్పుల్లో మొత్తం 19 మంది మావోయిస్టుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ కొనసాగుతుండడంతో ఈ సంఖ్య 25 దాకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Putin India Visit: నేడు భారత్‌లో పుతిన్ పర్యటన – ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత
ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు భద్రతా బలగాల సిబ్బంది కూడా అమరులయ్యారు. ఘటనాస్థలి నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
టాప్ కమాండర్ మృతిపై సందిగ్ధం
ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన ఓ అగ్రనేత ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరణించిన వారిలో పీఎల్జీఏ-2 కమాండర్ వెల్ల మోడియం (Vella Modiyam) కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
వెల్ల మోడియం దక్షిణ బస్తర్‌లో మావోయిస్టులకు టాప్ కమాండర్, పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. హిడ్మా తరహాలో వ్యూహాత్మక దాడులకు నేతృత్వం వహించే మోడియంను ఒకానొక దశలో హిడ్మా కంటే పెద్ద నాయకుడిగా భావించేవారు. మోడియం ఎన్కౌంటర్ నిజమైతే అది నక్సలైట్లకు పెద్ద దెబ్బ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బీజాపూర్ అడవుల్లో కూంబింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

