Putin India Visit

Putin India Visit: నేడు భారత్‌లో పుతిన్‌ పర్యటన – ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈరోజు భారత్‌ పర్యటనకు చేరుకోనుండడంతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు అప్రమత్తంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ అధికారిక పర్యటనలో భారత్–రష్యాల మధ్య 25కు పైగా కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది. రక్షణ, అణుఎనర్జీ, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్య విభాగాల్లో చర్చలు ప్రధానంగా సాగనున్నాయి. పుతిన్‌ చివరిసారి 2021లో భారత్‌ వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఢిల్లీలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడంతో రెండు దేశాలు ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి.

పుతిన్‌ రాకను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి భద్రతను అమల్లోకి తెచ్చింది. ఢిల్లీ బ్లాస్ట్ ఘటన తర్వాత మరింత అప్రమత్తం అవసరమని భావించిన భద్రతా విభాగాలు ఐదు అంచెల వలయాన్ని ఏర్పాటు చేశాయి. స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, కృత్రిమ మేధస్సుతో పనిచేసే నిఘా పరికరాలు, ఫేస్‌ రికగ్నిషన్ కెమెరాలు—అన్ని ఒకేసారి పని చేస్తూ పూతిన‌ కదలికలన్నింటిని నిశితంగా పర్యవేక్షించనున్నాయి. పుతిన్‌ ఢిల్లీలో అడుగుపెట్టిన క్షణం నుండి ఈ 5-లేయర్‌ సెక్యూరిటీ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది.

పుతిన్‌ వ్యక్తిగత భద్రత ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. విదేశాల్లో ఆయన పర్యటించే ప్రతి ప్రదేశాన్ని రష్యా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ముందుగానే పరిశీలిస్తాయి. పుతిన్‌ బసచేసే హోటళ్లను, గదులను నెల రోజుల ముందే స్కాన్‌ చేస్తారు. విదేశాల్లో ఆయన భద్రత కోసం 40-50 మంది రష్యా కమాండోలు ముందుగానే భారత్‌కు చేరుకున్నారు. ఈ బృందం ఢిల్లీ పోలీసులు, NSG తో కలిసి సంయుక్తంగా భద్రతా పర్యవేక్షణ చేస్తుంది. పుతిన్‌కు అత్యంత చేరువగా ఉండే బాడీగార్డులను రష్యా ప్రత్యేక ప్రమాణాలతో ఎంపిక చేస్తుంది. వారి ఎత్తు, బరువు, శారీరక సామర్థ్యం, భాషాజ్ఞానం, పరీక్షలు—అన్నింటినీ పాస్‌ చేసినవారే ఆయనకు అతి సమీప రక్షకులుగా పనిచేస్తారు. 35 ఏళ్లకే వారు రిటైర్‌ కావాల్సి ఉంటుంది.

Also Read: F16 Filghter Jet: కుప్పకూలిన అమెరికా ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-16సి

పుతిన్‌ ప్రయాణించే ఆరస్‌ సెనాత్‌ లిమోజిన్‌ కూడా ఈ పర్యటనలో భాగంగా మాస్కో నుంచి ప్రత్యేకంగా విమానంలో తీసుకొస్తున్నారు. ఇది పూర్తిగా బుల్లెట్‌ ప్రూఫ్‌, గ్రెనేడ్‌ దాడులను తట్టుకోగలిగేది. అగ్నిప్రమాదాలు జరిగినా లోపలి ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక రక్షణ పొరలు అమర్చబడ్డాయి. టైర్లు దెబ్బతిన్నా వాహనం చాలా దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ సప్లై కూడా వాహనంలోనే ఉంటుంది.

పుతిన్‌ విదేశాల్లో ఉన్నప్పుడు అతని ఆహారం భద్రత కోసం కూడా ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. ఆయన తీసుకునే భోజనాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక మొబైల్‌ ల్యాబ్‌ ఎప్పుడూ వెంట ఉంటుంది. హోటల్‌ స్టాఫ్‌ తయారు చేసే ఆహారాన్ని ఆయన తీసుకోరు. రష్యా నుంచి వచ్చిన చెఫ్‌లు, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది ఆయన కోసం ప్రత్యేకంగా పనిచేస్తారు.

పుతిన్‌ ప్రయాణించే ఇల్యుషిన్‌ IL-96-300PU విమానాన్ని “ఫ్లయింగ్‌ ప్లూటాన్‌”గా పిలుస్తారు. అందులో జిమ్‌, వైద్య కేంద్రం, బార్‌, అత్యాధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉంటాయి. ఒకేసారి 262 మంది ప్రయాణం చేయవచ్చు. ఆగకుండా 11 వేల కిలోమీటర్లు ప్రయాణించే శక్తి ఉంది. పుతిన్‌ ఎక్కడికి వెళ్లినా వెంటనే ప్రయాణించేందుకు ప్రత్యేక బ్యాకప్‌ జెట్‌ కూడా తోడుగా ప్రయాణిస్తుంది.

Also Read: The Ashes 2025-26: యాషెస్‌ సిరీస్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

ఈరోజు సాయంత్రం 7 గంటలకు పుతిన్‌ ఢిల్లీలో దిగుతారు. రాత్రికి ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగే ప్రైవేట్‌ డిన్నర్‌కు హాజరవుతారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించిన తర్వాత, రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ–పుతిన్‌ల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన ఇవ్వనున్నారు.

వేరుగా, రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలొసోవ్‌ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. అదనపు ఎస్‌-400 యూనిట్ల కొనుగోలు, సుఖోయ్–30 యుద్ధవిమానాల అప్‌గ్రేడ్‌, ఇతర మిలటరీ హార్డ్‌వేర్‌ సరఫరా అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అణుఎనర్జీ రంగంలో కూడా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. కూడంకుళం న్యూక్లియర్‌ ప్లాంట్‌ విస్తరణపై రోసాటోమ్‌కు రష్యా క్యాబినెట్‌ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ పర్యటన ముగిసే నాటికి భారత్–రష్యాల మధ్య అనేక కీలక ఒప్పందాలు సంతకం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *