Jagga Reddy: మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి, అర్హత కేటీఆర్‌కు లేవని ఆయన స్పష్టం చేశారు. బుధవారం రోజున హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని మాట్లాడారు.
రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం అనేక త్యాగాలు చేసిందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. నెహ్రూ కుటుంబం చరిత్ర దేశమంతటికీ తెలుసని, కానీ, తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కుటుంబం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేసిందని ఆయన విమర్శించారు. అలాంటి నేపథ్యం ఉన్న కేటీఆర్‌కు దేశ నాయకుడైన రాహుల్ గాంధీని ప్రశ్నించే హక్కు ఏ మాత్రం లేదని జగ్గారెడ్డి అన్నారు.
రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యమని, విలువలు లేకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదని జగ్గారెడ్డి హితవు పలికారు. కేటీఆర్‌కు నైతిక విలువలు ఉంటే, ఇకపై రాహుల్ గాంధీ గురించి మాట్లాడటం మానుకోవాలని ఆయన గట్టిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీ అని, కానీ బీఆర్‌ఎస్ కేవలం ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.
కేటీఆర్ మీరు ఇక్కడే, అంటే తెలంగాణలోనే రాజకీయాలు చేయండి. అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, మేమందరం మీతో పోటీ పడతాం. కానీ, మర్యాద లేకుండా రాహుల్ గాంధీని విమర్శిస్తే మాత్రం, నేను చూస్తూ ఊరుకోను, ఖచ్చితంగా ప్రతిఘటిస్తాను అని జగ్గారెడ్డి గారు కేటీఆర్‌ను హెచ్చరించారు.
