Sarpanch election: వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దొంగిలింపు ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కార్యాలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి పలు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
ఈ కార్యాలయం గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జైరాం తండా (ఐ) గ్రామాలకు నామినేషన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఉదయం సిబ్బంది వచ్చేసరికి తాళాలు పగిలి ఉండటం, పత్రాలు చిందరవందరగా పడి ఉండటం గమనించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
స్థలాన్ని సందర్శించిన ఆర్ఓ కోటయ్య, ఏఆర్ఓ అంజయ్య పరిశీలించగా హన్మాపూర్, గిర్మాపూర్, జైరాం తండా గ్రామాల నామినేషన్ పత్రాలు గల్లంతైనట్లు నిర్ధారించారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై శంకర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అధికారులు స్పందిస్తూ—
“భౌతిక పత్రాలు కనిపించకపోయినా, అన్ని నామినేషన్ల వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో భద్రపరచబడ్డాయి. కాబట్టి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకం ఉండదు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు కొనసాగుతాయి.” అని స్పష్టం చేశారు.
నామినేషన్ పత్రాల దోపిడీ వెనుక ఉద్దేశం ఏమిటి? ఎవరు చేశారు? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
